పార్లమెంటును కుదిపేసిన దోడా హత్యాకాండ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో జరిగిన హత్యాకాండ సోమవారం పార్లమెంటును కుదిపేసింది. అమాయకుల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రకటన చేయాల్సిందిగా అన్ని పార్టీల సభ్యులు హోం మంత్రి ఎల్.కె. అద్వానీని డిమాండ్ చేశారు. దోడా జిల్లాలో ప్రజల ప్నాణాలను కాపాడడంలో ప్రభుత్వంవిఫలమైందంటూ ప్రతిపక్షాల సభ్యులు ధ్వజమెత్తారు. పరిస్థితిపై వివరించడానికి హోం మంత్రి ఎల్.కె. అద్వానీ సభలో లేకపోవడం అభ్యంతరకరమని లోకసభలో ప్రతిపక్షాల సభ్యులు అన్నారు. దోడా జిల్లాలోని హత్యాకాండ పట్ల అధికార పక్షానికి చెందిన సభ్యులు కూడా కొందరు తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. ప్రజల ప్రాణాలను రక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్నికోరారు.
ఈ అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తుతూ- ఒక జిల్లాలోని ప్రజలనే కాపాడలేని హోం మంత్రి దేశాన్ని ఎలా రక్షించగలరని దాస్ మున్షీ (కాంగ్రెస్) ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన విషయాల్లో తాము ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్నామని, కానీ మౌనంగా వుండలేమని, హోం మంత్రి సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, అయితే ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, సభకు రాకపోవడం మంత్రి అసమర్థతను, నిజాయితీ లేకపోవడాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటామని హోం మంత్రి హామీ ఇచ్చారని, ఇంత వరకు చేసిందేమీ లేదని, దోడా జిల్లాలో హత్యలు కొనసాగుతూనే వున్నాయని ఆయన అన్నారు.
పరిస్థితిని అదుపు చేయలేకపోతే ప్రభుత్వం తప్పుకోవాలని సోమనాథ్ ఛటర్జీ (సిపిఎం) అన్నారు. దోడా జిల్లాలో భద్రతా వైఫల్యాలున్నాయని ఆయన విమర్శించారు. ఆగ్రా సదస్సు తర్వాత పరిస్థితి మరింత విషమించిందని, ప్రభుత్వం సంఘటనలకు మాత్రమే ప్రతిస్పందిస్తోందని ఆయన అన్నారు. హోం మంత్రి సభలో లేకపోవడాన్ని బట్టే ప్రభుత్వం పరిస్థితి అదుపులోకి తేవడానికి ఎంత సీరియస్‌గా వుందో తెలియజేస్తోందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
దోడా జిల్లాలోని సంఘటనల పట్ల మదన్‌లాల్ ఖురానా, వినయ్ కతియార్, యోగి ఆదిత్యనాథ్ (బిజెపి) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications