అర్ధరాత్రి నుంచి రెవిన్యూ సమ్మె
హైదరాబాద్‌ః రెవిన్యూ మంత్రి అశోక్ గజపతిరాజుతో ఆదివారం జరిపిన చర్చలు విఫలం కావడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఇప్పటివరకు మంత్రితో మూడు విడతలు చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని సంఘం పేర్కొంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని సంఘం కోరింది. రెవిన్యూ ఉద్యోగులు గత వారమే సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ రాష్ట్రంలో నెలకొనివున్న కరవు పరిస్థితుల దృష్ట్యా తొందరపాటు తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరడంతో సమ్మెను వాయిదా వేసి మంత్రి అశోకగజపతిరాజుతో చర్చలుజరిపారు.
విశాఖ భూముల కుంభకోణంలో అక్రమంగా సస్పెండ్ చేసిన రెవెన్యూ సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెవిన్యూ సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెవిన్యూ శాఖపై మంచి అవగాహన వున్నందున స్వయంగా రంగంలోకి దిగి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
సమ్మె కారణంగా రెవిన్యూ, పౌరసరఫరాల శాఖల్లో పనులు స్తంభించి పోయే ప్రమాదం వుంది. కరవు పరిస్థితుల కారణంగా సమ్మె యోచనను విరమించుకోవాలని రెవిన్యూ శాఖ మంత్రి అశోక గజపతి రాజు పిలుపు నిచ్చారు. సమ్మె జరిగినా కరవు సహాయ చర్యలకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications