అమెరికాకు భద్రతామండలి దన్ను
ఐక్యరాజ్యసమితిః టెర్రరిజంపై అమెరికా ఎక్కుపెట్టిన పోరుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పూర్తి మద్దతు ప్రకటించింది. అంతర్జాతీయ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో సహా పెళ్లగించడానికి యావత్ ప్రంపచం ఒక్కటై పోరాడాలని పిలుపునిస్తూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భద్రతామండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ అసాధారణ తీర్మానంలో టెర్రరిజం అణిచివేతకు సభ్యదేశాలు తీసుకోవల్సిన చర్యలను సూచించారు. ఈ తీర్మానాన్ని మండలి ఆమోదించడంతో ఇది అంతర్జాతీయ చట్ట రూపం దాలుస్తుంది.భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. టెర్రరిజాన్ని ప్రొత్సహించరాదని, టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించరాదని, టెర్రరిస్టుల ఆస్తులను స్తంభింపజేయాలని సభ్యుదేశాలను ఈ తీర్మానంలోకోరారు.
కట్టుతప్పిన దేశాలు తీవ్రమైన అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవల్సివస్తుందని హెచ్చరించారు. తీవ్రవాదులకు మద్దతుగా నిలిచే దేశాలు కూడా దండనను ఎదుర్కోవల్సివుంటుందనిపేర్కొన్నారు. సుమారు 24 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఈ తీర్మానాన్ని భద్రతామండలి ఆమోదించింది.
ఈ తీర్మానంతో టెర్రరిస్టుల చర్యలకు ఆర్ధిక సహకారంఅందకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన చట్టబద్దమైన బాధ్యత సభ్య దేశాలపై వుంటుంది. టెర్రరిస్టులనుఅరెస్టు చేసి న్యాయస్థానాల ముందు నిలబెట్టాల్సివుంటుంది. కొన్ని దేశాల ప్రభుత్వాల చేతలకు అమాయక పౌరులను శిక్షించరాదని ఐక్యరాజ్యసమితిసెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ పిలుపు నిచ్చారు.












Click it and Unblock the Notifications