పాకిస్తాన్ కు నీటిని విడుదల చేసిన భారత్.. ఇక తప్పట్లేదు
జమ్మూ కాశ్మీర్ పరిధిలోని చీనాబ్ నదీ తీర ప్రాంతాలు అప్రమత్తం అయ్యాయి. కిష్త్వార్ జిల్లాలోని ప్రముఖ జల విద్యుత్ ప్రాజెక్ట్ దుల్హస్తీ డ్యామ్ వద్ద జరుగుతున్న పూడికతీత పనుల కారణంగా నదిలో నీటి ప్రవాహం అసాధారణంగా పెరిగింది. ఈ అదనపు వరద ఒత్తిడిని తట్టుకోవడానికి, డ్యామ్ భద్రతను కాపాడటానికి రాంబన్ జిల్లాలోని బగ్లిహార్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తోన్నారు అధికారులు. రెండు గేట్లను ఎత్తి, వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు.
ఈ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బగ్లిహార్ రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. పర్వత ప్రాంతాల గుండా ప్రవహించే చీనాబ్ నది తన వెంట భారీగా ఇసుక, బురదను మోసుకొస్తుంది. ఈ వ్యర్థాలు రిజర్వాయర్లలో నిలిచిపోవడం వల్ల డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతింటుంది. దీన్ని నివారించడానకి నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అధికారులు దుల్హస్తీ ప్రాజెక్టు వద్ద పూడికతీత ప్రక్రియను చేపట్టారు.

ఈ క్రమంలో లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ ప్రవాహం బగ్లిహార్ జలాశయానికి చేరుకోవడంతో అక్కడ కూడా గేట్లను ఎత్తక తప్పలేదు. దీంతో నది మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో రాంబన్, కిష్త్వార్, దోడా, రియాసి జిల్లాల స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. తీర ప్రాంతాల ప్రజలకు సూచనలు జారీ చేశారు. సమీపంలో నివసించే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నది వైపు వెళ్ళవద్దని హెచ్చరించారు.
ముఖ్యంగా పశువుల కాపరులు తమ జీవాలను నది సమీపానికి తోలుకెళ్లవద్దని, నదిలో చేపల వేటను తాత్కాలికంగా నిలిపివేయాలని స్పష్టం చేశారు. స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సహాయంతో తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. ఈ నీరు మొత్తం కూడా పాకిస్తాన్ కు చేరుతుంది. సింధు జలాల ఒప్పందంలో చీనాబ్ నది కీలకం. ఈ ఒప్పందం పరిధిలోకి వచ్చే చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ డ్యామ్ గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
సాగు నీటి అవసరాల కోసం పాకిస్తాన్ ఈ నది ప్రవాహంపైనే ఎక్కువగా ఆధారపడుతుంటుంది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి వినియోగ హక్కులను భారత్, పాకిస్తాన్ మధ్య విభజించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాక్ స్వస్తి పలికే వరకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ గత ఏడాది ప్రకటించింది. నీటి మట్టం భారీగా పెరగడంతో అదనపు జలాలను విడుదల చేయక తప్పట్లేదు.
జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణలో ఈ పూడికతీత ప్రక్రియ అత్యంత కీలకమైన భాగం. నది గుండా వచ్చే మట్టి రిజర్వాయర్ అడుగుభాగాన పేరుకుపోవడం వల్ల డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ మట్టి విద్యుత్ ఉత్పత్తి చేసే భారీ టర్బైన్ బ్లేడ్లను దెబ్బతీస్తాయి. ఈ నష్టాన్ని నివారించేందుకు ఏటా నిర్దేశిత సమయంలో గేట్లను పూర్తిగా తెరిచి ప్రవాహ వేగంతో పూడికను కొట్టుకుపోయేలా చేస్తారు. ఈ సాంకేతిక ప్రక్రియ వల్ల నది ప్రవాహం మారుతుంది.












Click it and Unblock the Notifications