అడవిరాముడు, యమగోల సినిమాలకు ముందు అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు!
తెలుగు సినీ చరిత్రలో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన 'అడవి రాముడు', 'యమగోల' చిత్రాలలో నందమూరి తారకరామారావు నటన, నృత్యాలు ఒక ప్రభంజనం సృష్టించాయి. అయితే, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టుల కథనాల ప్రకారం.. ఈ రెండు సినిమాలకు కథా చర్చల దశలో తొలుత అనుకున్న హీరో 'నటభూషణ' శోభన్ బాబు కావడం ఒక ఆసక్తికరమైన నిజం. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, సత్యచిత్ర బ్యానర్‌పై చలసాని శరత్ బాబు నిర్మించిన క్లాసిక్ హిట్ చిత్రం 'అడవి రాముడు'. దర్శకుడు రాఘవేంద్రరావు అంతకుముందే శోభన్ బాబు తో 'బాబు' (1975) అనే సూపర్‌హిట్ సినిమా తీశారు. దాంతో, ఈ అడవి నేపథ్యంలో సాగే యాక్షన్ కథను కూడా శోభన్ బాబుతోనే చేయాలని భావించి ఆయనకు లైన్ వినిపించారు.
ఎన్టీఆర్‌కు బాగుంటుంది
కథ విన్న తర్వాత శోభన్ బాబు .. అడవిలో ఫైట్లు, భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఎనర్జిటిక్ డ్యాన్సులు చేయడం కంటే తనకు అప్పటికే ఉన్న 'సోగ్గాడు' ఇమేజ్‌కు తగినట్లుగా ప్యామిలీ, రొమాంటిక్ డ్రామా అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అడవిలో అన్నిరోజులు ఉండటం కూడా సరికాదనుకున్నారు. ఈ మాస్ క్యారెక్టర్‌కు తనకంటే ఎన్టీఆర్ అయితే వందకు వంద శాతం న్యాయం చేయగలరని ఆయనే స్వయంగా చిత్రబృందానికి సలహా ఇచ్చారు. దాంతో రాఘవేంద్రరావు ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీ వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది.

యమలోకం నేపథ్యంలో..
ఇక సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలను జోడించి 'యమలోకం' నేపథ్యంలో సాగే సోషియో-ఫాంటసీ కామెడీ చిత్రం 'యమగోల'. ఈ కథను కూడా మొదట శోభన్ బాబు కే వినిపించారు. అయితే అప్పట్లో యముడి పాత్రకు లెజెండరీ నటుడు ఎస్.వి. రంగారావు అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఎస్వీఆర్ అకస్మాత్తుగా కన్నుమూయడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నిర్మాత డి.వి.ఎస్. రాజు చేతుల్లోకి, దర్శకత్వ బాధ్యతలు తాతినేని రామానందరావు వద్దకు వచ్చాయి. అప్పటికే శోభన్ బాబు గారు వరుసగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతో చాలా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా యమలోకం అనగానే భీకరమైన డైలాగులు, రాజకీయ విమర్శలు, పంచ్‌లు చెబితేనే జనం బాగా రిసీవ్ చేసుకుంటారని, అందుకు శోభన్ బాబు క్లాస్ ఇమేజ్ కంటే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ అయితేనే కరెక్ట్ అని చిత్ర బృందం భావించి ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ హీరోగా, కైకాల సత్యనారాయణ యముడిగా నటించిన 'యమగోల' అప్పట్లో థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. నేటికీ ఈ రెండు సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మైలురాళ్లు.












Click it and Unblock the Notifications