CJP protest in Delhi: ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన సోనమ్ వాంగ్ చుక్
దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు జూన్ 20 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. నీట్- యూజీ 2026 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీక్ లకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు. ఇక తాజాగా ఈ నిరసనల్లో పాల్గొన్న ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ చెప్పినట్లుగానే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇటీవల నిరసనల్లో మాట్లాడుతూ.. ప్రధాన్ రాజీనామా చేయకపోతే నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు.
వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో వందలాది మంది యువత, విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రానికి మరింతమంది అక్కడకు చేరుకునేట్లుగా కనిపిస్తోంది. అలాగే సీజేపీ ఆందోళనలకు మద్దతుగా రైతు ఉద్యమ నాయకులు, కాప్ నాయకులు ఇప్పటికే జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. నిరాహార దీక్ష రెండు నిమిషాల మౌనం తర్వాత ప్రారంభమైంది. నిరాహారదీక్ష ప్రారంభించడానికి ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, సోనమ్ వాంగ్ చుక్ రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీ స్మారకానికి నివాళులు అర్పించారు.
అయితే నిరాహారదీక్ష సోనమ్ వాంగ్ చుక్ మాత్రమే చేపడతారని.. మైగ్రేయిన్ సమస్య కారణంగా తాను చేయట్లేదని అభిజీత్ దిప్కే తెలిపారు. అయితే వాంగ్ చుక్ కు మద్దతుగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. ఇక ఈ ఆందోళనల్లో పాల్గొనాలనని రైతులు, విద్యార్థులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నీట్- యూజీ 2026 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీక్ లకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకూ ఈ ఆందోళనలు ఆగవని స్పష్టం చేశారు.
ఇక ఆదివారం తన అధికారిక ఎక్స్ వేదికగా అభిజీత్ దిప్కే కీలక పోస్టు పెట్టారు. ఈ నిరసనల్లో పాల్గొనకుండా ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్ కు చెందిన రైతు నాయకులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వారిని జంతర్ మంతర్ కు రాకుండా అడ్డుకుంటున్నారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చారుణి .. సోమవారం ఆందోళనల్లో పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే ఓసారి ఆయన ఇక్కడికి వచ్చి తమకు మద్దతు తెలిపినట్లు వివరించారు.

మరోవైపు మహారాష్ట్రలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ అయిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. పరీక్షకు ఒక్క రోజు ముందు పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్లు లీక్ చేయడానికి దేశంలో ఇంకా ఏమైనా పరీక్షలు మిగిలి ఉన్నాయా..? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications