బంగారంపై మోదీ కీలక ప్రకటన, దేశ ప్రజలకు కృతజ్ఞతలు
బంగారం కొనుగోళ్లపై దేశ ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. తన 135వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని కీలక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తాను ఇచ్చిన పిలుపునకు సామాన్య ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, దేశ ఆర్థిక స్థిరత్వం కోసం విలాసవంతమైన ఖర్చులు, ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని మోదీ చేసిన విజ్ఞప్తిని ప్రజలు బాధ్యతాయుతంగా స్వీకరించారని వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు
విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవడం, ఇంధన ఆదా కోసం సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవడం వంటి చర్యలను ప్రజలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారని మోదీ తెలిపారు. ఈ సానుకూల ధోరణి దేశ విదేశీ మారక నిల్వలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. బంగారం, ఇంధనం వంటి అత్యవసర దిగుమతులపై భారం తగ్గించడంద్వారా రూపాయి విలువను సుస్థిరం చేయాలనేదే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల
ప్రధాని విజ్ఞప్తి తర్వాత మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మే 10న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,53,140 ఉండగా, జూన్ 28 నాటికి అది రూ. 1,39,873కి పడిపోయింది. అదేవిధంగా కేజీ వెండి ధర రూ. 2,62,350 నుంచి రూ. 2,16,541కి తగ్గింది. ఈ స్వల్ప వ్యవధిలోనే బంగారం ధర రూ. 13,267, వెండి ధర రూ. 45,809 మేర తగ్గడం విశేషం.
ప్రభుత్వ చర్యలు - ఫలితాలు
ప్రధాని అభ్యర్థనతో పాటు, ప్రభుత్వం కూడా బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారుల డిమాండ్ తగ్గి, రాబోయే నెలల్లో బంగారం దిగుమతులు 10 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా, దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని చేసిన పిలుపు, ప్రభుత్వ విధానాలు కలిసి సానుకూల మార్పులకు దారితీస్తున్నాయి.














Click it and Unblock the Notifications