స్కూల్ లో సైకో విద్యార్థి కాల్పులు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు
నిత్యం విద్యార్థులతో కళకళలాడే పాఠశాలలో ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది. చూస్తుండగానే స్కూల్ లోని ముగ్గురు విద్యార్థులు, మరో ముగ్గురు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మంచి విద్యను అభ్యసించి దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారాల్సిన ఓ విద్యార్థే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాఠశాలలోకి తుపాకీని తీసుకురావడమే కాకుండా ఏకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఆరుగురు హతం అయ్యారు. ఈ దారుణమైన ఘటన థాయిలాండ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన థాయిలాండ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నాన్ త బూరీ ప్రాంతంలోని ఓ స్కూల్ లో శుక్రవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాలలోని ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు విద్యార్థులు.. మరో ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ సైకో విద్యార్థి అప్పటికే తన నానమ్మ తాతయ్యలను హతమార్చి పాఠశాలలోకి ప్రవేశించినట్లు థాయ్ పోలీస్ ప్రతినిధి ట్రైరాంగ్ పివ్ పాన్ తెలిపారు. పాఠశాలలో ఆరుగురిని హతమార్చిన తర్వాత చివరకు తనను తాను కూడా కాల్చేసుకున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారని స్పష్టం చేశారు.

అలాగే నిందితుడు మరికొంతమందిపైనా కాల్పులు జరిపాడని ప్రస్తుతం వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చర్నిరాకుల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడింది 14 ఏళ్ల విద్యార్థి అని తెలిపారు. ఈ దాడులకు పాల్పడిన తర్వాత తనను తాను కాల్చుకున్నట్లు కూడా వెల్లడించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ కో ఎడ్యూకేషనల్ స్కూల్ లో దాదాపు 3 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అంతా 12 నుంచి 18 ఏళ్ల వయసు వారేనని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications