పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అన్ని పార్టీలకు బిగ్ టాస్క్.. పట్టభద్రులపై పట్టు ఎవరికో!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు కీలక స్థానాలు - మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ఊపందుకుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీ దేవి, టీన్మార్ మల్లన్న పదవీకాలం 2027 మార్చిలో ముగియనుండటంతో కొత్త ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ ఎన్నికలు కేవలం రెండు స్థానాలకు పరిమితం కాకుండా రాజకీయ ప్రతిష్టాత్మక పోరుగా మారనున్నాయి. అధికార కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పార్టీలో పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు.

బీఆర్‌ఎస్, బీజేపీ, జనసేన వంటి పార్టీలు కూడా ముందస్తు సన్నాహాలు ప్రారంభించాయి. పట్టభద్రుల ఓటు అనేది సాధారణ ఎన్నికల్లా కాకుండా అభ్యర్థి గుణగణాలు, విద్యా రంగ సమస్యలు, ఉద్యోగాలు, ప్రభుత్వ విధానాలపై ఎక్కువగా ఆధారపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే "పట్టభద్రులపై పట్టెవరికో?" అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 3ఏళ్లు అయినా ఉద్యోగాలు, విద్యారంగంలో పెద్ద మార్పు రాలేదనే విమర్శలని అధిగమించి గ్రాడ్యుయేట్ల ఆదరణ పొందటం కాంగ్రెస్ ముందున్న పెద్ద టాస్క్. పట్టభద్రుల్లో అధికారపార్టీపై అసంతృప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న క్రమంలో దానిని తగ్గించి వారిని అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికలో అంతర్గత పోటీతో ఐక్యత లోపించే ప్రమాదం ఉన్న కారణంగా ఈ ఎన్నికల్లో ఆ లోపం లేకుండా చూసుకోవాలి.
బీఆర్ ఎస్ విషయానికి వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ మొమెంటం తగ్గింది. కొత్త తరం పట్టభద్రుల్లో, యువతలో ఆకర్షణ తగ్గినట్లు కనిపిస్తోంది. దానిని అధిగమించి వారిని ఆకట్టుకోవాలి.సంస్థాగతంగా కొన్ని జిల్లాల్లో బలహీనత, కేడర్‌లో నిరుత్సాహం ఉండే అవకాశం ఉంది, దానిని అధిగమించి ఈ ఎన్నికల్లో బలంగా ముందుకు వెళ్ళాల్సి ఉంది.
బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణలలో ఇంకా పరిమిత బలం ఉండటం బీజేపీకి మైనస్ గా చెప్పొచ్చు. పట్టభద్రుల్లో కేంద్ర పార్టీ అనే భావన కొంతమందిలో ఉండటం, అభ్యర్థి ఎంపిక విషయంలో సరిగ్గా దృష్టి పెట్టలేకపోవటం వంటి అంశాలు బీజేపీకి మైనస్ గా చెప్పొచ్చు . ఏది ఏమైనా ఈసారి పట్టభద్రుల మద్దతు ఎవరికో అన్న అంశం తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన నేపధ్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.













Click it and Unblock the Notifications
