విరూపాక్ష దర్శకుడి మరో మిస్టరీ.. వృషకర్మ ట్రైలర్ వచ్చేసింది!
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'వృషకర్మ' ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. విరూపాక్ష అనంతరం డైరెక్టర్ కార్తీక్ దండు రూపొందించిన ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ట్రైలర్, పురాతన రహస్యాలు, అతీంద్రీయ శక్తులు, ఉత్కంఠభరిత సీన్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. కియారా ఖన్నా, జయరామ్, సత్య కీలక పాత్రల్లో కనిపించారు. విలన్ పాత్రలో స్పర్శ్ శ్రీవాస్తవ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిధి అన్వేషణలో భాగంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి అడుగుపెట్టిన హీరో.. మానవాళిపై ప్రభావం చూపే ఓ పురాతన శక్తిని వెలికితీసే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వేద విజ్ఞానం, అతీంద్రియ భావనల స్ఫూర్తితో రూపొందించిన ఈ సినిమాలో సృష్టి ధర్మాన్ని కాపాడే దైవ బాధ్యత హీరోపై పడే తీరును ఆసక్తికరంగా చూపించారు. నిగూఢమైన చిహ్నాలు, భారీ గుహలు, ఉత్కంఠ రేపే సీన్లు, అతీంద్రియ అంశాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

సినిమాలోని మిస్టరీ వాతావరణాన్ని, గుహల సెట్టింగ్ లను తెరపై ఆవిష్కరించడంలో సాంకేతిక నిపుణులు కీలక పాత్ర పోషించారు. శ్రీ నాగేంద్ర తాంగాల ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు చక్కటి దృశ్య బలాన్ని చేకూర్చింది. రాహుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ మిస్టరీ మూడ్‌ను చక్కగా పట్టుకోగా.. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్యం సంగీతం సీన్లలోని ఉత్కంఠను మరింత పెంచింది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. పౌరాణిక అంశాలు, మిస్టరీ, యాక్షన్ మేళవింపుగా వస్తున్న 'వృషకర్మ' ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.














Click it and Unblock the Notifications
