ఎకోటూరిజం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణ రాష్ట్రంలో అడవులను సంరక్షిస్తూనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఎకోటూరిజం ప్రాజెక్టులకు తక్షణమే భూములు బదిలీ చేయాలని ఎకోటూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ సూచించింది. సచివాలయంలో బుధవారం జరిగిన కమిటీ రెండో సమావేశంలో పర్యాటక, అటవీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం రూ.1,376 కోట్లతో పర్యావరణ అనుకూల పర్యాటక ప్రాజెక్టులను అమలు చేస్తోందని, రాష్ట్రం నలువైపులా ఆరు సర్క్యూట్ల పరిధిలో వీటిని చేపట్టినట్లు అధికారులు వివరించారు.
తొలి విడతలో రూ.435 కోట్ల విలువైన 120 ప్రాజెక్టులు, రెండో విడతలో రూ.941 కోట్ల విలువైన 65 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే భూముల బదిలీ, ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం కారణంగా కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నట్లు కమిటీ గుర్తించింది. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించింది.ఫ్యూచర్‌సిటీలో 203 ఎకరాల విస్తీర్ణంలో వంతారతో కలిసి టీజీఎఫ్‌డీసీ నైట్ సఫారీ, వీఆర్ పార్కు, డైనోసార్ పార్కు, అడ్వెంచర్ పార్కు, ఎకో కనెక్షన్ సెంటర్‌లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది.

తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో ఒప్పందం జరిగినా ఇప్పటికీ ఈ భూమి టీజీఐఐసీ నుంచి టీజీఎఫ్‌డీసీకి బదిలీ కాలేదు. వికారాబాద్‌లో బ్రీజ్ ప్రాజెక్టులో అటవీ శాఖ ఇప్పటికే నాలుగు వసతి గృహాలు సిద్ధం చేసింది. మరో ఆరింటిని సిద్ధం చేయనుంది. ప్రస్తుతం ఒక పగలు యాత్ర ప్యాకేజీ అమలులో ఉండగా, త్వరలో ఉదయం టూర్, రాత్రి డిన్నర్ ప్యాకేజీలను ప్రారంభించాలని నిర్ణయించారు.
పులిగుండాల సరస్సులో అదనపు కాటేజీలు, కెఫెటేరియా, పర్యాటకుల సౌకర్యాలు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మన్ననూరు జంగిల్ రిసార్ట్‌లో కూడా అదనపు కాటేజీలు, వసతి గృహాలు నిర్మించనున్నారు. ఎస్సారెస్పీ నందిపేట బ్యాక్‌వాటర్ సర్క్యూట్‌ను గాడేపల్లి, ఉమ్మెడ, జలపల్లిని కలుపుతూ ఏర్పాటు చేయనున్నారు. దీనిని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో బీవోటీ పద్ధతిలో చేపట్టేందుకు టెండర్లు పిలిచారు.
దోమలపెంట జంగిల్ రిసార్ట్‌కు సంబంధించి 5 డూప్లెక్స్ కాటేజీలు, కెఫే, రిసెప్షన్ డిజైన్లు ఖరారయ్యాయి. అయితే ఈ అటవీ భూమిని అటవీ అభివృద్ధి సంస్థకు ఇంకా బదిలీ చేయలేదు. నీటిపారుదల శాఖ నుంచి సాంకేతిక అనుమతులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. సంగారెడ్డికి సమీపంలో మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 400 మొసళ్లు, వివిధ రకాల పక్షులకు ఆవాసం ఉంది. ఇక్కడ వాటర్‌బోర్డుతో కలిసి అటవీ శాఖ ఐదు ఎకరాల భూమిని గుర్తించింది.
రూ.10 కోట్లతో బీవోటీ పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం జరిగినా అధికారికంగా భూ బదలాయింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.తెలంగాణ ప్రభుత్వం ఎకోటూరిజాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించి, అడవుల సంరక్షణతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించేలా ప్రాజెక్టులు చేపడుతోంది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఇప్పటికే 'ది బ్రీజ్' పేరుతో ఎకో-టూరిజం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లగ్జరీ టెంట్‌లు, నేచర్ వాక్స్, బర్డ్ వాచింగ్, సఫారీలు వంటి అనుభవాలు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు వేగంగా పూర్తయితే రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఒరవడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
