బంగారం ధర పతనం.. గోల్డ్ లోన్ తీసుకున్నవారికి షాక్!
దేశీయ మార్కెట్లో ఇటీవల బంగారం ధరలు భారీగా పడిపోతుండటం సాధారణ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు ఊరటనిస్తున్నప్పటికీ.. ఇప్పటికే గోల్డ్‌పై లోన్స్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. జనవరి 2026 గరిష్ట స్థాయితో పోలిస్తే బంగారం ధరలు దాదాపు 33 శాతం మేర పడిపోయాయి. బుధవారం బంగారం ధరలు తగ్గినా గురువారం నాడు కాస్త పెరిగాయి. గురువారం నాడు 10 గ్రాములకు రూ.2610 పెరిగి రూ.1,25,890గా వద్దకు చేరింది. గతంతో పోలిస్తే బంగారం ధరలు భారీగా తగ్గడంతో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ) రుణ గ్రహీతలకు మార్జిన్ కాల్ నోటీసులు జారీ చేస్తున్నాయి.
మార్జిన్ కాల్, ఎల్టీవీ నిబంధనలు ఏమిటి?
బంగారం విలువ ఆధారంగా ఇచ్చే రుణాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) లోన్-టు-వాల్యూ(ఎల్టీవీ) నిష్పత్తిని నిర్దేశించింది. రుణ కాలపరిమితి అంతా ఈ పరిమితికి లోబడి ఉండేలా బ్యాంకులు చూసుకోవాలి. రూ.2.50 లక్షల వరకు రుణాలకు గరిష్టంగా 85 శాతం, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలకు మించిన రుణాలకు గరిష్టంగా 75 శాతం ఎల్టీవీ పరిమితి ఉంటుంది. ఎల్టీవీ శాతాన్ని (మొత్తం బకాయి అసలు+వడ్డీ/తాకట్టు పెట్టిన బంగారం ప్రస్తుతం విలువ)x100 ఫార్ములాతో లెక్కిస్తారు. బంగారం ధర పడిపోయినప్పుడు తాకట్టు వస్తువు విలువ తగ్గి, ఎల్టీవీ నిష్పత్తి అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా పెరుగుతుంది.

ఉదాహరణకు రూ.లక్ష విలువైన బంగారంపై 75 శాతం ఎల్టీవీతో రూ.75,000 రుణం తీసుకున్నారనుకుందాం. బంగారం ధర 20 శాతం తగ్గి తాకట్టు విలువ రూ.80,000కి పడిపోతే.. అదే 75 శాతం నిష్పత్తి ప్రకారం గరిష్ట రుణ అర్హత రూ.60,000 మాత్రమే ఉంటుంది. అప్పుడు మిగిలిన రూ.15,000 వ్యత్యాసాన్ని నగదు రూపంలో చెల్లించాలని లేదా అదనపు బంగారం జమ చేయాలని బ్యాంకు నోటీసు ఇస్తుంది.
ఎవరికి ముందుగా నోటీసులు?
నెలవారీ వడ్డీ చెల్లించకుండా గడువు ముగిసిన తర్వాత అసలు, వడ్డీ కలిపి ఒకేసారి చెల్లించే బుల్లెట్ రీపేమెంట్ రుణ గ్రహీతలకు ధరలు తగ్గినప్పుడు ముందుగా మార్జిన్ కాల్ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.
లోన్ మొత్తం వెంటనే కట్టాలా? వేలం రూల్స్ ఏంటి?
మార్జిన్ కాల్ నోటీసు వచ్చినంత మాత్రాన లోన్ తీసుకున్న వారు లోన్ మొత్తాన్ని ఒకేసారి తీర్చాల్సిన అవసరం లేదు. రూల్స్ ప్రకారం నిర్దేశిత మార్జిన్ మొత్తాన్ని భర్తీ చేస్తే సరిపోతుంది. అలాగే నోటీసు రాగానే బ్యాంకులు వెంటనే బంగారాన్ని వేలం వేయవు. ముందుగా ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గడువు ఇస్తూ నోటీసు జారీ చేస్తాయి. వేలం ప్రక్రియ చేపట్టాల్సి వస్తే ప్రస్తుత మార్కెట్ విలువలో కనీసం 90 శాతం రిజర్వ్ ధర నిర్ణయించాలి. వేలంలో వచ్చిన మొత్తంలో రుణ బకాయి పోగా మిగిలిన అదనపు సొమ్మును 7 పని దినాల్లోగా తిరి చెల్లించాలి.
నోటీసు అందితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ నుంచి మార్జిన్ కాల్ నోటీసు అందినప్పుడు ఆందోళన చెందకుండా వెంటనే సంబంధిత బ్రాంచ్ ను సంప్రదించి ప్రస్తుత బంగారం వాల్యుయేషన్, అసలు-వడ్డీ బకాయి, చెల్లించాల్సిన కచ్చితమైన మార్జిన్ మొత్తాన్ని రాతపూర్వకంగా తీసుకోవాలి. వీలైతే కొంత నగదు చెల్లించి పార్ట్ పేమెంట్ చేయడం ద్వారా ఎల్టీవీ తగ్గడంతో పాటు వడ్డీ భారీ కూడా తగ్గుతుంది. ప్రత్యామ్నాయంగా అదనపు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టవచ్చు. భవిష్యత్తులో రుణాలు తీసుకునేటప్పుడు గరిష్ట పరిమితి వరకు కాకుండా బంగారం విలువలో 60-65 శాతం లోపు మాత్రమే రుణం తీసుకోవడం శ్రేయస్కరం. దీనివల్ల మార్కెట్లో 15-20 శాతం ధరలు తగ్గినా మార్జిన్ కాల్ సమస్య తలెత్తదు.














Click it and Unblock the Notifications
