బెండకాయ, టమాటా పచ్చడి.. ఇలా చేసి తినండి.. నోటికి సూపర్ టేస్ట్!
కూరలు తినీ తినీ నోటికి టేస్ట్ కావాలనిపిస్తే కొన్ని వెరైటీ పచ్చళ్ళు చేసుకుని తినాలి. అది కూడా రోటి పచ్చడి అయితే ఆ మజానే వేరు. ఇక అటువంటి వెరైటీ పచ్చళ్లలో బెండకాయ, టమాటా పచ్చడి ఒకటి. ఆంధ్ర, తెలంగాణ ఇళ్లలో చాలా ఎక్కువగా చేసుకునే ఈ పచ్చడి నోటికి సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఈ రోజు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే బెండకాయ టమాటా పచ్చడి రెసిపీని తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బెండకాయలు -పావుకిలో
టమాటాలు - 3 నుంచి 4 మీడియం సైజ్
ఉల్లిపాయలు - 1 పెద్దది (సన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 10 నుండి 15 కారం బట్టి
చింతపండు - కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు - 10
పోపు గింజలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
ఎండు మిరపకాయలు - 2
నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం:
ముందుగా బెండకాయలను కడిగి, నీరు పూర్తిగా తుడిచి, ముక్కలు చేసుకోండి. టమాటాలను కూడా మధ్యస్థ ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఒక ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, అందులో బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. అవి కాస్త మగ్గాక టమాటా ముక్కలు, పచ్చి మిర్చి, కాస్త చింతపండు వేసి బాగా మగ్గనివ్వండి. అన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వండి.
ఇలా చేస్తే సూపర్ టేస్టీ బెండకాయ టమాటా పచ్చడి
ఇప్పుడు రోట్లో చల్లారిన మిశ్రమాన్ని, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి వేసి నూరండి. బాగా మెత్తగా పేస్ట్ లా చేయకండి. అలా చేస్తే రుచి పోతుంది. ఇలా నూరుకున్న దానిని నేరుగా అయినా తినొచ్చు. ఇంకా మంచి రుచి కావాలంటే మరికొంత నూనె వేసి చివర్లో మరోసారి తాలింపు చేసుకుంటే రుచికరమైన బెండకాయ, టమాటా పచ్చడి రెడీ అవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో అయినా, చపాతీలో అయినా సూపర్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications