ఏపీలో పేద రోగులకు గుడ్ న్యూస్- ప్రైవేటు ఆస్పత్రులకు ఊరట..!
ఏపీలో గతంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రారంభించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సల పథకం ఆ తర్వాత పేర్లు మార్చుకుని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవగా కొనసాగుతోంది. ఈ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో పేద రోగులకు డబ్బులు లేకుండా చికిత్స అందించాలంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు అలా ఇవ్వకుండా బకాయిలు పెట్టడంతో పేదలకు సకాలంలో చికిత్సలు అందించేందుకు ఆస్పత్రులు కూడా నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి సర్కార్ (AP Govt) నిధుల్ని విడుదల చేసింది.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రాష్ట్రంలో సేవలందిస్తున్న 721 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.162.72 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు, ప్రైవేటు ఆస్పత్రుల సంఘం ఆశా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటివరకు బీడీఏస్ (bill discounting system) ద్వారా రూ.1,108.48 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రుల ఖాతాలకు జమ చేశారు. ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా మరో 396.40 కోట్ల రూపాయలు ఆస్పత్రుల ఖాతాలకు చేరాయి. ఇలా రెండు విధానాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.1,504.88 కోట్ల వరకు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. దీని వల్ల పేద రోగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు నిరాటంకంగా అందించేందుకు వీలు కలిగింది.




Click it and Unblock the Notifications