"ఈసీలో ఏం జరుగుతోంది ?"- సీఈసీని టార్గెట్ చేసిన మరో ఎన్డీయే పార్టీ..!
కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లకు తెలియకుండా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా నోరు విప్పుతున్నాయి. ఇప్పటికే ఎన్డీయేలో (NDA) భాగస్వాములుగా ఉన్న టీడీపీ, లోక్ జన్ శక్తి, ఆర్ఎల్ఎం పార్టీలు తాజా వివాదంపై ఈసీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఇదే కోవలో ఇప్పుడు మరో భాగస్వామ్య పార్టీ జేడీఎస్ నేత, కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి కూడా ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈసీలో విభేదాలపై కేంద్రమంత్రి, జేడీఎస్ నేత హెచ్ డీ కుమార స్వామి ఇవాళ మీడియాతో మాట్లాడారు. "వాస్తవ పరిస్థితి ఏమిటి? ఎన్నికల సంఘం లోపల ఏం జరుగుతోంది?" అని ఆయన ప్రశ్నించారు. మీడియాలో వస్తున్న వార్తలకు, ఎన్నికల సంఘం లోపల ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న తేడాను ఆ సభ్యులు వివరించాలని ఆయన కోరారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సహా ఆ ముగ్గురు సభ్యుల రాజ్యాంగబద్ధ సంస్థపైనే ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

"వారి బాధ్యత చాలా పెద్దది. ఇది ఏమీ చిన్న విషయం కాదు. ఆ ముగ్గురు ఎన్నికల సంఘం సభ్యుల మధ్య-అందులో చైర్మన్ కూడా ఉన్నారు-అసలు సమస్య ఏమిటి? అందులో లోపం ఎక్కడ ఉంది? ఏదైనా సమస్య ఉంటే, వారు దానిని బయటపెట్టాలి," అని కుమారస్వామి వరుస ప్రశ్నలు సంధించారు. అలాగే ఈసీపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సైతం ఆయన మద్దతు పలికారు.
ఏ పార్టీ లేదా ఏ నాయకుడైనా సరే, ఏదైనా డిమాండ్ చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం బాధ్యత అనేది చాలా కీలకమన్నారు. తద్వారా విపక్షాల ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పి తీరాలని హెచ్ డీ కుమారస్వామి తేల్చిచెప్పారు.













Click it and Unblock the Notifications
