తుపాన్‌బీభత్సానికి 55 మంది బలి
హైదరాబాద్:రాయలసీమ జిల్లాలను అతలాకుతలం చేసిన తుపానుబీభత్సానికి 55 మంది బలయ్యారు. కర్నూలు,కడప జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా వుంది. కర్నూలు జిల్లాలో ఒక చెరువు గట్టు తెగడంతో పక్కనే వున్న గ్రామదేవత ఆలయం మునిగిపోయి ఆలయంలో వున్న పూజరితో సహా పందొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. కడప జిల్లాలో మరో 20 మంది మరణించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కూడా మృతుల సంఖ్య మరో పది వుండవచ్చని అంటున్నారు. మృతుల సంఖ్యపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఐదుగురు వాగులోకి కొట్టుకుపోయినట్లు సమాచారం. కడప పట్టణంలోకి నీళ్లు వచ్చి చేరడంతో వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. కడప జిల్లాలోపెన్నా, పాపాగ్ని, చిత్రావతి, కుందు నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పాతమిద్దెలు కూలిపోయాయి. 10 నుంచి 15 మంది దాకా గల్లంతయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి కడపలోకి బుగ్గవంక వరద నీరు వచ్చి పడడంతో జీనజీవనం మొత్తం ఛిన్నాభిన్నమైంది. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి.
అల్పపీడన ప్రభావం వల్ల కడప, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని సోమవారమే ఆయా జిల్లాల కలెక్టర్లకు సమాచారం వెళ్లింది.అయినా కడప, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో, వరదల అనంతర పరిస్థితిని వివరించడంలోవిఫలమయ్యారని ప్రభుత్వం ఆగ్రహంగా వుంది. మంగళవారం ఉదయం నెల్లూరు వద్ద తుఫాను తీరాన్ని దాటిన తర్వాత భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.
కడప జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పట్టణాన్ని అనుకుని ప్రవహించే బుగ్గవంక నిండిపోయింది. ఒక్కసారిగా గేట్లు ఎత్తి నీటిని వదిలేయడంతో ఆ నీరంతా కడప పట్టణాన్ని ముంచేసింది. కడపకువిద్యుత్ సరఫరా ఆగిపోయింది. రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. కొన్ని ప్రాంతాల్లో తెప్పల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి వరకు దాదాపుఅయిదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ చెప్తున్నారు. ప్రజలు ఇళ్లపైకప్పుల మీదికి ఎక్కి బిక్కుబిక్కుమంటున్నారు. కడప పట్టణానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు దఫాలుగా అధికారులతో సమావేశమయ్యారు.
వాయుగుండం వల్ల సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాల వల్ల నెల్లూరు జిల్లాలో పలు చెరువులు తెగిపోయాయి. ఆ నీటితో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజల జీవనంఅస్తవ్యస్తమైంది. ప్రజలు చాలా చోట్ల చిక్కుకుపోయి ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు. చెట్లు కూలిపోయాయి.విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన రెండు మరబోట్లు, 17 తెప్పలు గల్లంతయ్యాయి. చెన్నై- కలకత్తా జాతీయ రాహదారిలో వరద నీరు ప్రవేశించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నెల్లూరు పట్టణంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. సోమశిల ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.
చిత్తూరు జిల్లాలో ఇద్దరు మరణించినట్లు సమాచారం.అయిదేళ్ల తర్వాత స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది. అనంతపురం జిల్లాలో ఒకరు గల్లంతయ్యారు.












Click it and Unblock the Notifications