అకాల వర్షాలు: పంటలు నష్టం
హైదరాబాద్: అకాల వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. వాతావరణంలో సంభవించిన అనూహ్య మార్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఒక వైపు గజగజ వణికిపోతుంటే, మరో వైపు అకాల వర్షాలకు పంటలు నష్టపోయి రైతులు విలవిలలాడుతున్నారు.
పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షం కురవడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాగాణి, మెట్ట, వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. నల్లరేగడి నేలల్లో వేసిన పొగాకు వర్షాలకు తడిసిపోయింది. దీంతో పొగాకు దిగుబడి రంగు, నాణ్యత దెబ్బ తినే ప్రమాదం వుంది. కృష్ణా పశ్చిమ డెల్టాల్లోని మాగాణి పొలాల్లో వేసిన వరిని కోసి కుప్పలు పెట్టారు. ఇదంతా నీట తడిసింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు, గూడూరు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో మినుము, వరి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. కావలి డివిజన్‌లో ఆదివారం రాత్రి నుంచి కుంభవృష్టి పడుతోంది. వేలాది ఎకరాల్లో కోతకొచ్చిన మినుము పంట నీట మునిగింది. కావలి రూరల్, జదంకి, బుచ్చిరెడ్డిపాలెం, తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం వరి వెన్ను తీసే దశలో వుంది. దాంతో పంట చేతికి రావడం కష్టమని భావిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కావలిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పట్టణం మొత్తం జలమయమైపోయింది. ప్రధాన రహదారులపై నీళ్లు ప్రవహించగా, జనావాసాలలోకి మోకాలి లోతు నీళ్లు వచ్చాయి. జన జీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాలతో పిల్లివాగు, ఉప్పువాగు, చిప్పలేరు, చీకట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కందుకూరు, జిగిత్యాలలో ఆరు సెంటీ మీటర్ల వర్షపాతం చొప్పున, కళింగపట్నం, శృంగవరపుకోట, రామగుండంలలో ఐదేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.












Click it and Unblock the Notifications