జమ్మూః జమ్మూ కాశ్మీర్‌లోని రాజోరి జిల్లాలోని ఒక సరిహద్దు గ్రామంపై శనివారం రాత్రి తీవ్రవాదులు దాడి చేసి ఎనిమిది మందిని కాల్చిచంపారు. మృతులంతా హిందూమతానికి చెందినవారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.
ఈ దాడిలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రవాదులు బృందం గ్రామంపై దాడి చేసి మైనార్టీ మతానికి చెందిన మూడు ఇళ్లపై దాడి చేసివిచక్షణ రహితంగా కాల్పులు జరిపిందని పోలీసులు చెప్పారు. మృతులను ఆశోక్ కుమార్, మాధవ్‌రామ్, జ్యోతి దేవి, బివ్లూ దేవి, బబ్లీ దేవి, శకుంతలదేవిగా గుర్తించారు. సంఘటన దరమిలా ఈ ప్రాంతంలో తీవ్రఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పోలీసులుపెద్దఎత్తున గాలింపు ప్రారంభించారు.