స్టార్ క్రికెటర్‌తో ప్రేమ.. పెళ్లి కాకుండానే తల్లి అయిన నటి!
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఎప్పుడూ తన ముక్కుసూటితనానికి, ధైర్యమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. సమాజం ఏమనుకున్నా సరే తన ఇష్టానుసారంగానే ఆమె జీవితాన్ని గడిపారు. పెళ్లి చేసుకోకుండానే తల్లిగా మారి, తన కూతురు మసాబా గుప్తాను ఒంటరిగా పెంచి పెద్ద చేశారు. అయితే ఓ ఒంటరి తల్లిగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, పడ్డ కష్టాలు, ఆ ప్రయాణంలో ఎదురైన మానసిక సంఘర్షణల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఒంటరి తల్లిగా ఉండటాన్ని ప్రోత్సహించను
ఇటీవల జూమ్ ఛానెల్‌తో జరిపిన సంభాషణలో నీనా గుప్తా మాట్లాడుతూ.. ఒంటరి తల్లిగా పిల్లలను పెంచడం అనేది అత్యంత కష్టమైన, శ్రమతో కూడుకున్న పని అని స్పష్టం చేశారు. ఒంటరి తల్లిగా ఉండటాన్ని తాను ఎంతమాత్రం ప్రోత్సహించనని అన్నారు. తాను ఆ పని చేశాను కాబట్టే.. అలా చేయమని ఎవరికీ చెప్పనన్నారు. ఓ బిడ్డను ఒంటరిగా పెంచడం వల్ల తల్లి ఆరోగ్యంపై, మనస్సుపై, అలాగే ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇది కేవలం తల్లికే కాదు, పెరిగే బిడ్డకు కూడా ఓ రకంగా అన్యాయమే. ఒకవేళ వేరే మార్గం లేక ఎంచుకంటే తప్ప.. ఇష్టపూర్వకంగా మాత్రం ఈ మార్గం ఎంచుకోవద్దని తాను చెబుతానని నీనా గుప్తా తన బాధను వ్యక్తం చేశారు.

కూతురికి ద్వేషం కలగకుండా నిజం చెప్పాను..
తన కూతురు మసాబా పెరిగే క్రమంలో తన పుట్టుక గురించిన నిజాలు వేరే ఎవరి ద్వారా కాకుండా తన ద్వారానే తెలియాలని నీనా గుప్తా అనుకున్నారు. మసాబా వయసుకు, అవగాహనకు తగినట్లుగా క్రమంగా నిజం చెప్పినట్లు వివరించారు. తాను ఏ పరిస్థితుల్లో మసాబాకు జన్మనిచ్చానో ఆమెకు చెప్పడం చాలా ముఖ్యమన్నారు. అయితే ఆ నిజం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పానన్నారు. ఆమె మనసులో తన తండ్రి పట్ల ఎలాంటి ద్వేషం లేదా నెగెటివిటీ పెరగకూడదనే ఉద్దేశంతోనే ఎంతో నెమ్మదిగా విషయాలను వివరించానని నీనా గుప్తా చెప్పారు.
కూతురికి చాలా సార్లు క్షమాపణలు చెప్పాను
మసాబా గుప్తా ఎదుగుతున్న సమయంలో ఆమెతో పాటు తండ్రి లేకపోవడం తన నిర్ణయం వల్లే జరిగిందని నీనా గుప్తా అంగీకరించారు. అందుకీ ఈ విషయంలో తన కూతురికి చాలాసార్లు క్షమాపణలు కూడా చెప్పానని వెల్లడించారు. 'నేను నా కూతురితో ఎప్పుడూ నిజాయితీగా ఉంటాను. నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు మీ నాన్న నీతో లేకపోవడం నా తప్పే.. అని చెబుతూ మసాబాకు చాలాసార్లు సారీ చెప్పానని నీనా గుప్తా పేర్కొన్నారు. మసాబా కూడా పరిస్థితిని, ఆనాటి పరిస్థితులను బాగా అర్థం చేసుకుందని నీనా గుప్తా వెల్లడించారు.
నీనా గుప్తా-వివియన్ రిచర్డ్స్ రిలేషన్
1980ల కాలంలో నీనా గుప్తా, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌తో ప్రేమలో ఉన్నారు. అయితే అప్పటికే రిచర్డ్స్‌కు వివాహమై పిల్లలు ఉండటంతో వారు పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ ప్రేమ బంధంలో ఉన్నప్పుడే నీనా గుప్తా ప్రెగ్నెంట్ అయ్యారు. రిచర్డ్స్ తన దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత నీనా గుప్తా గర్భం గురించి తెలుసుకున్నప్పటికీ.. సమాజం నుంచి వచ్చిన ఎన్నో విమర్శలను ఎదుర్కొని మసాబాకు ఒంటరిగా జన్మనిచ్చారు. ఆ సుదీర్ఘ ప్రయాణం తన జీవితంలో ఎంతో కష్టంగా గడిచిందని నీనా గుప్తా గుర్తుచేసుకున్నారు.













Click it and Unblock the Notifications
