తిరుమలకు వెళ్లే ప్రైవేట్ వాహనాలపై తేల్చి చెప్పిన టీటీడీ
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపించిన నేపథ్యంలో.. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 81,724 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వారిలో 38,361 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.04 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. మొత్తం 4.39 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.58 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సోమవారం సాయంత్రం స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. ఆ మరుసటి రోజు సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణంతో ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు ఘనంగా ఆరంభమౌతాయి.

బ్రహ్మోత్సవ రోజుల్లో తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రోజూ 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాహనాల క్రమబద్దీకరణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు వ్యక్తమౌతోన్నాయి.
దీనిపై తాజాగా టీటీడీ స్పందించింది. ఈ వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రచారం అవుతున్న వార్తను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, తిరుమల సమాచారాన్ని అధికారికంగా విడుదల చేసే ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తామని వివరించింది.
వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించింది. టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించింది.













Click it and Unblock the Notifications
