టిఆర్‌యస్, కాంగ్రెస్‌ల అవకాశవాదం:బాబు
విశాఖపట్నం: తెలంగాణ విషయంలో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)ల అవకాశవాదం బయట పడిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వాఖ్యానించారు. తెలంగాణ విషయంలో టిఆర్‌యస్ నిజస్వరూపం బయటపడిందని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ రెండో ఎస్సార్సీ అంటోందని, ప్రత్యేక ప్యాకేజీ అనే అవకాశం కూడా ఉన్నదని, దీన్ని బట్టి కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. సమైక్యతతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని, వేర్పాటువాదం వల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం సోనియా, రాజీవ్ గాంధీల ఫొటోలతో ప్రకటనలు ఇస్తోందని, ప్రధాని మన్మోహన్‌ను డమ్మీగా మార్చిందని, తాము ఎప్పుడు కూడా ఎన్టీ ఆర్ బొమ్మను వాడలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలపై పోలీసుల సహకారంతో దౌర్జన్యానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి పి. అశోక్ గజనతిరాజు కుమార్తె వివాహానికి ఇక్కడికి వచ్చిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications