పరిటాల దేహంపై 10 గాయాలు, 9 బుల్లెట్ల వెలికితీత
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి భౌతిక కాయంపై వైద్యులు 10 బుల్లెట్ గాయాలను గుర్తించారు. రవి మృతదేహం నుంచి 9 బుల్లెట్లను వెలికి తీశారు. పరిటాల భౌతికకాయానికి సిబిఐ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం రీపోస్టుమార్టం జరిగింది. హంతుకులు బాంబులు కూడా వేయడంతో బాంబు రవ్వలు పరిటాల దేహంలో చిక్కుకుని కనిపించాయి. పరిటాల రవి తలలో రెండు, ఎడమ చేతిలో రెండు, పొట్టలో మూడు కాలేయంలో ఒకటి బుల్లెట్ గాయాలు కనిపించాయి. పరిటాల ఇంటి వద్ద మంచంపై వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు.
వెంకటాపురంలోని సమాధిని బద్దలు కొట్టి రవి భౌతిక కాయాన్ని వెలికి తీశారు. సమాధి తవ్వకం 30 మంది కూలీల ఆధ్వర్యంలో సోమవారం ఉదయమే ప్రారంభమైంది. దాదాపు 12 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులు రీపోస్టుమార్టం నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి, ఉప్పు వేసి ఖననం చేయడంతో పరిటాల భౌతిక కాయం చెడిపోలేదు. దీంతో రీపోస్టుమార్టం చేయడం కొంత సులువైంది.
రీపోస్టుమార్టం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రీపోస్టుమార్టం స్థలానికి ఎవరినీ రానీయలేదు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు గ్రామస్థులను హెచ్చరించారు. దాంతో ఎవరూ ఇళ్ల నుంచి వెలుపలికి రాలేదు. మీయా ప్రతినిధులను కూడా పోలీసులు అనుమతించలేదు. వెంకటాపురం దారులను అన్నింటినీ దిగ్భందనం చేశారు. దీంతో రీపోస్టుమార్టం ప్రశాంతంగా జరిగింది.












Click it and Unblock the Notifications