రాజకీయాలపై తేల్చి చెప్పిన రాఘవ లారెన్స్: విజయ్, రజినీకాంత్ పై.. !!
ప్రముఖ తమిళ నటుడు, కోరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయ రంగప్రవేశంపై గత కొద్దిరోజులుగా చర్చ సాగుతోంది. విజయ్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానంలో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది తమిళనాట. తిరుచ్చి ఈస్ట్ ను నిలబెట్టుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఆ స్థానం కోసం లారెన్స్ పేరు తెరపైకి వచ్చింది. తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాల్లో పునాదులు బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీవీకేకు ఈ నియోజకవర్గం అత్యంత కీలకం.
ఈ పరిణామాల మధ్య రాఘవ లారెన్స్ తన రాజకీయ రంగ ప్రవేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీవీకేను విమర్శించడాన్ని తప్పుపట్టారు. డీఎంకే, ఏఐఏడీఎంకేపై నిప్పులు చెరిగారు. అసూయతోనే టీవీకేపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరు వేగంగా ఎదుగుతున్నప్పుడు వారిని అడ్డుకునేందుకే విపక్షాలు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తాయని చురకలు అంటించారు.

విమర్శలు చేస్తోన్నారంటే తన దృష్టిలో అది టీవీకే అద్భుత విజయం సాధించినట్టేనని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. ఈ విజయాలను ఓ తిరుగులేని అస్త్రంగా అభివర్ణించారాయన. గాలి కూడా చొరబడలేని చోటికి వెళ్లగలుగుతుందని, ఎంత పెద్ద కొండనైనా బద్దలు కొడుతుందని వ్యాఖ్యానించారు. రెప్ప మూసి తెరిచే లోపు టీవీకే అధికారంలోకి వచ్చి కూర్చుందని గుర్తు చేశారు. విమర్శించడం మానేసి టీవీకే ఎలా గెలిచిందో, దాన్ని మించి విజయం ఎలా సాధించాలో తెలుసుకోవాలని రాఘవ లారెన్స్.. ప్రతిపక్షాలకు హితబోధ చేశారు.
తన రాజకీయ ప్రవేశం గురించి కూడా స్పష్టతనిచ్చారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని తేల్చి చెప్పారు. తల్లి ఆశీర్వాదం తీసుకుని, అభిమానుల సమక్షంలో త్వరలోనే ఓ భారీ వేదికపై అధికారికంగా ప్రకటిస్తానని అన్నారు. సినిమా రంగంలో డ్యాన్స్ మాస్టర్‌గా తన ప్రయాణం ప్రారంభమైనప్పటి నుండి ఈ స్థాయికి చేరుకునే అబిమానులు, మీడియా ఎంతో తోడ్పాటునందించిందని, అందుకే వారికి చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోబోనని పేర్కొన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు లేకుండా తాను ఏ పనీ చేయనని మొదలుపెట్టనని, తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తలైవాను కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పారు. అలాగే బీజేపీ నేత అన్నామలై నూతన పార్టీ పెట్టడంపై వస్తున్న కథనాలపై పాజిటివ్‌గా స్పందించారు. విద్యావంతుడు, సమాజంపై చక్కటి అవగాహన ఉన్న వ్యక్తి కొత్తగా రాజకీయాలలోకి రావడం చాలా మంచి పరిణామమని లారెన్స్ అన్నారు.
గొడవలు పడటానికో లేదా ధ్వేషపూరిత రాజకీయాలు చేయడానికో తాను రావట్లేదని, తనవంతు ప్రజలకు మేలు చేయాలనేదే తన ఉద్దేశమని అన్నారు. ప్రస్తుతం ఒక ట్రస్ట్ ద్వారా వంద మంది దివ్యాంగులకు నేను సహాయం చేయగలుగుతున్నానని, అధికారంలోకి వస్తే లక్షలాది మందికి సహాయం చేయవచ్చని వ్యాఖ్యానించారు. డబ్బు గానీ, పదవి గానీ ఆశించట్లేదని, మనం బతికినప్పుడు ఎలా బతికామో ముఖ్యం కాదు, చనిపోయినప్పుడు ఈ ఊరంతా మన కోసం ఏడవాలనేదే తన కోరిక అని రాఘవ లారెన్స్ భావోద్వేగంగా అన్నారు.
పాఠశాలల, దేవాలయాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఒక మంచి పని చేసిందని లారెన్స్ హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి పనితీరు కూడా చాలా చురుగ్గా సాగుతోందని కొనియాడారు. మంచి పనులను ఎవరు చేసినా తాను అభినందిస్తానని అన్నారు. విజయ్ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలకు లారెన్స్ తన పూర్తి మద్దతును ప్రకటించారు. టీవీకే ప్రభుత్వంలో మరిన్ని మంచి మార్పలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications