హార్ముజ్ లో చిక్కుకుపోయిన 500కి పైగా భారతీయ నావికులు-107 రోజులుగా నరకం..!
అమెరికా-ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జలసంధిగా మారిపోయిన హార్ముజ్ (Strait of hormuz)ను దాటడం ఇప్పుడు ఏ దేశ నౌకకు అయినా కష్టసాధ్యంగా మారింది. రిస్క్ చేసి ఈ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే అమెరికా, ఇరాన్ లలో ఎవరో ఒకరు క్షిపణులతో దాడి చేసి పేల్చేయడం, లేదా సముద్రంలో అమర్చిన మందుపాతరలు పేలడం ఖాయం. ఈ భయంతోనే వందల సంఖ్యలో భారతీయ నావికులు ఇప్పుడు హార్ముజ్ లో వందరోజులుగా చిక్కుపోయినట్లు తెలుస్తోంది.
హార్ముజ్ జలసంధిలో భారతీయ జెండా కలిగిన 13 నౌకల్లో సుమారు 562 మంది భారతీయ నావికులు గత 107 రోజులుగా చిక్కుకుపోయి భయం, అనిశ్చితి మధ్య గడుపుతున్నట్లు తాజాగా సమాచారం అందింది. మరోవైపు ఎంటీ సెలెస్టియల్ నౌకలో అనారోగ్యంతో మరణించిన భారతీయ పౌరుడు నిశాంత్ ఉర్తనాథన్ మృతదేహాన్ని త్వరలో భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది.ఈ మేరకు ఒమన్‌లోని మస్కట్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన మృతదేహాన్ని నౌక నుండి దించి, వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.

భారతీయ జెండా కలిగిన కనీసం 13 కార్గో నౌకల్లో ఉన్న 562 మంది భారతీయ నావికులు గత 107 రోజులుగా హార్ముజ్ లో చిక్కుకుపోయినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. వీరిలో 329 మంది హార్ముజ్ జలసంధికి పశ్చిమ వైపున, 233 మంది జలసంధికి తూర్పున ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో చిక్కుకున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుండి ఈ 562 మంది నావికులు జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఇవాళ భారతీయ జెండా కలిగిన విరాట్ 1 అనే నౌక ఇంజన్ పనిచేయకపోవడంతో సిబ్బందిని వేరే నౌకల్లోకి తరలించే ప్రక్రియ చేపట్టినట్లు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.














Click it and Unblock the Notifications