610 జీవోను అమలు చేస్తాం: రోశయ్య
హైదరాబాద్: ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాంతం వారికి న్యాయం చేసే 610 జీవోను, గిర్‌గ్లానీ కమీషన్ నివేదికను అమలు చేస్తామని, వీటిని అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. 610 జీవోపై, గిర్‌గ్లానీ కమీషన్ నివేదికపై శాసనసభలో జరిగిన చర్చకు ఆయన సోమవారం సమాధానమిచ్చారు. 610 జీవో అమలు విషయంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. ఐదు, ఆరు జోన్‌లలో ప్రభుత్వోద్యోగాల్లో స్థానికులకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమైందని, ఈ విషయంలో లోటుపాట్లను సరిదిద్దుతామని ఆయన అన్నారు.
ఈ రెండు జోన్‌లలోనే కాకుండా అన్ని జోన్‌లలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాల విషయంలో చర్యలు తీసుకోవాలనే తెలుగుదేశం సభ్యుడు యనమల రామకృష్ణుడు అభిప్రాయాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన చెప్పారు. 610 జీవోపై రెండున్నర గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. చిత్తశుద్ధి వుంటే టి ఆర్‌యస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.
రెండేళ్లలో దేవాదుల తొలి దశ
గోదావరి నదిపై తలపెట్టిన దేవాదుల ప్రాజెక్టు తొలి దశ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తెలుగుదేశం సభ్యుడు నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానమిస్తూ ఆ విషయం చెప్పారు. తెలంగాణలోని మెట్టప్రాంతాలకు మంచినీరు, సాగు నీరు అందించడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.
దేవాదుల ప్రాజెక్టుకు జరిపిన కేటాయింపులను ఖర్చు చేయడం లేదని, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే విధానాన్నే ప్రభుత్వం ఆలోచిస్తోందని నరేందర్ రెడ్డి అన్నారు. ఏడున్నర టియంసిలతో దేవాదుల కింద 2 లక్షల 85 వేల ఎకరాలకు నీరు ఎలా అందిస్తారని ఆయన అడిగారు.
పల్లెబాట హమీలు హుళక్కి
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాజీవ్ పల్లెబాటలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడం లేదని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ సోమవారం శాసనసభలో విమర్శించారు. ముఖ్యమంత్రీ రాజీవ్ పల్లెబాటపై విస్తృతమైన చర్చ జరిగింది. రాజీవ్ పల్లెబాట సందర్భంగా స్థానిక శాసనసభ్యులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజీవ్ పల్లెబాట సందర్భంగా వచ్చిన సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోందని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications
