తిరుమలలో ఈ సారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు- ఉత్సవాల మధ్య తేడాలు..ప్రత్యేకతలు..!!
తిరుమలలో భక్తుల అనూహ్య రద్దీ నెలకొంది. ప్రస్తుతం క్యూలైన్లలోని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. 12వ తేది నుండి 14వ తేది వరకు వరుస సెలవుల రానున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రద్దీకి అనుగు ణంగా టీటీడీ చర్యలు చేపట్టింది. కాగా.. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరగనున్నాయి. ఈ రెండు ఉత్సవాల మధ్య తేడాలు.. ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి.
తిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాలికట్ల బ్రహ్మోత్సవాల తో పాటుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సందర్భంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు సాధారణంగా భాద్రపద మాసంలో జరుగుతాయి. అసలైన బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసంలో నవరాత్రులలో జరుగుతాయి.

భాద్రపద మాసంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమై, చివరి రోజు ధ్వజావరోహణంతో శాస్త్రోక్తంగా ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సమయం లో నిర్వహిస్తారు. అయితే, ఈ ఉత్సవాలకు ధ్వజారోహణం, ధ్వజావరోహణం వంటి తంతువులు ఉండవు. అలాగే సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే పెద్ద కట్టె రథం అంటే రథోత్సవం బదులుగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి వారు బంగారు రథంపై భక్తులకు దర్శనమిస్తారు.
ఈ నెల 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు ఈ రెండు ఉత్సవాల్లో నూ మలయప్ప స్వామి వారి వివిధ వాహన సేవలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య లో తరలి వస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం తో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ప్రతీ రోజు ఉదయం.. సాయంత్రం వాహన సేవ ఉంటుంది. 23వ తేదీన శ్రవణా నక్షత్రం సందర్భంగా పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం ఘనంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణం ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల వేళ శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.














Click it and Unblock the Notifications
