చివరి టెస్టులో పాక్ గెలుపు: సిరీస్ సమం
బెంగుళూర్: మూడోది చివరిదీ అయిన బెంగళూర్ టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ భారత్‌పై 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్ బాలాజీ వికెట్‌ను తీసి విజయాన్ని అందుకుంది. దీంతో మూడు టెస్టుల సిరీస్ సమమైంది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో భారత్ మ్యాచ్ డ్రా కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. భారత్ 214 పరుగులకు ఆలవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలిన యూనిస్‌ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో విశేషంగా రాణించిన భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.
కుంబ్లే 37 పరుగులతో నాటవుట్‌గా మిగిలాడు. పాకిస్థాన్ ఆఫ్ స్పినర్లు ముగ్గురితో పాటు సీమర్ సమీ భారత బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. సచిన్ టెండూల్కర్ వంటి మేటి బ్యాట్స్‌మన్ కూడా పరుగులు తీయడానికి అవస్థలు పడాల్సి వచ్చింది. 98 బంతులు ఎదుర్కున్న సచిన్ టెండూల్కర్ కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడంటే భారత బ్యాట్స్‌మెన్ ఎంతగా తంటాలు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ద్రావిడ్ 16 పరుగులకే అవుటయ్యాడు. లక్ష్మన్ ఐదు పరుగులకు, గంగూలీ రెండు పరుగులకు అవుటయ్యారు. ఈ సిరీస్‌లో పరుగులు చేయడంలో గంగూలీ ఘోరంగా విఫలమయ్యాడు. ఆఫ్రిదీకు మూడు, కనేరియా, అర్షద్, సమీలకు రెండేసి వికెట్లు లభించాయి. పాకిస్థాన్ నిర్దేశించిన 383 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అటుంచి వికెట్లను కాపాడుకోవడానికి భారత్ బ్యాట్స్‌మెన్ చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు.
చివరి టెస్టు మ్యాచ్‌లో ఓటమితో సొంత గడ్డమీద పాకిస్థాన్‌ను ఓడించాలనే భారత్ ఆశలు వమ్మయ్యాయి. పాకిస్థాన్‌కు ఇది భారత్ గడ్డపై ఐదవ విజయం. భారత్‌పై పాకిస్థాన్‌కు ఇది 11 విజయం. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 53 టెస్టుల్లో పాక్ 11 టెస్టులు గెలవగా, 8 టెస్టులను భారత్ గెలిచింది. మిగతావి డ్రా అయ్యాయి. బౌలర్లును వినియోగించడంలో ఇంజమామ్ వుల్ హక్ విశేషమైన వ్యూహాన్ని అమలు పరిచాడు. పాక్ కెప్టెన్ ఇంజమామ్ టాస్ గెలవడమే మ్యాచ్ ఫలితాన్ని దాదాపుగా నిర్ణయించింది.












Click it and Unblock the Notifications
