ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమే: కోనేరు
హైదరాబాద్: తనపై తెలుగుదేశం పార్టీ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై తాను ఏ విచారణకైనా సిద్ధమేనని పురపాలక శాఖ మంత్రి కోనేరు రంగారావు అన్నారు. తన రాజకీయ జీవితంపై తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విచారణ జరిపినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
తనపై తెలుగదుదేశం పార్టీ చౌకబారు ఆరోపణలకు దిగుతోందని, తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి తాను సిద్ధం ఉన్నానని ఆయన చెప్పారు. తాను ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన విషయాలను పట్టుకొని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తన పేషీలో ఎవరైనా ఇస్తే డబ్బులు తీసుకుంటున్నారేమో తనకు తెలియదని, బలవంతంగా ఎవరూ డబ్బులు వసూలు చేయడం లేదని కూడా చెప్పానని, ఎన్నో బదిలీలు చేస్తున్నాం బంధువును బదిలీ చేస్తే పొరపాటా అని తాను అన్నానని ఆయన చెప్పారు. నీతిగా, నిజాయితీగా రాజకీయాల్లో జీవించాలనేది తన లక్ష్యమని ఆయన చెప్పారు. తన రాజకీయ జీవితం గురించి తెలుగుదేశం సభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు వంటివారికి చాలా తెలుసునని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
