సాగునీటి ప్రాజెక్టులపై సవాళ్లు, ప్రతిసవాళ్లు
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల వ్యవహారంపై మరోసారి గురువారం శాసనసభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో శాసనసభ సమావేశం వేడెక్కింది. సాగు నీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు రుజువులుంటే నిరూపించాలని కాంగ్రెస్ సవాల్ చేసింది. తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ చెప్పింది.
శాసనసభ వెలుపల చర్చకు వచ్చి సాగునీటి టెండర్లలో అవకతవకలు జరిగినట్లు నిరూపించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్ చేశారు. ఏప్రిల్ పదో తేదీన చర్చకు రావాలని అంటున్న ప్రభుత్వం వెనక్కి పోవద్దని, అక్రమాలను నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం శాసనసభా పక్ష ఉప నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారమంతా ముందు పెట్టాలని, తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఉంచుతామని, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ఏజెంట్లు ఎలా డబ్బులు చేసుకున్నారో నిరూపిస్తామని ఆయన అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో తమ నిజాయితీని నిరూపించుకుంటామని ధర్మాన ప్రసాదరావు అన్నారు. గత ఎనిమిది నెలలుగా ఒకే విషయాన్ని పట్టుకుని తెలుగుదేశం పార్టీ వేలాడుతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం వాదనలో పస లేదని ఇప్పటికే తేలిపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
