కెసిఆర్ తెలంగాణ తేవడం కల్ల: ఫార్వర్డ్ బ్లాక్
హైదరాబాద్: తెలంగాణ ఆకాంక్షలను కాలరాసి ప్రజల అభీష్టాన్ని తన రాజకీయ మనుగడకు, ఉన్నతికి దురుపయోగం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కల్ల అని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర శాఖ విమర్శించింది. ప్రజలకు ముఖం చూపే ధైర్యం లేక బేరసారాల పేరిట ఢిల్లీ గుడ్డి గల్లీలలో కెసిఆర్ ప్రవాస జీవితం గడుపుతున్నారని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర శాఖ కన్వీనర్ బి. విజయ్‌కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధినాయకత్వం అంగీకారం మేరకు తాము తెలంగాణ రాష్ట్ర శాఖను ప్రారంభించామని ఆయన చెప్పారు.
ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లో తమ పార్టీ ప్రతినిధుల తొలి సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు దేవబ్రత బిస్వాస్, నేతాజీ సోదరుడి కుమారుడు, లోక్‌సభ సభ్యుడు సుబ్రతా బోస్ హాజరవుతారని ఆయన చెప్పారు. నెల రోజుల పాటు మే నెలలో నేతాజీ సందేశ్ యాత్రను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించే దాకా తాము విశ్రమించబోమని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బిజెపిలకు సమదూరం పాటిస్తూ తెలంగాణకు అన్యాయం తలపెట్టే అన్ని దుష్టశక్తులను ఆమడ దూరంలో పెడతామని, తెలంగాణ ముసుగులో వున్న వాటిని కూడా దూరంగా ఉంచుతామని ఆయన అన్నారు.
నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్, సోనియా గాంధీల కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తలపెట్టని అన్యాయం లేదని, 1956లో నెహ్రూ, 1971లో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం చేశారని, ఇప్పుడు సోనియా గాంధీ అన్యాయం తలపెడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ నాయకత్వం ఈ మూడు సందర్భాల్లో స్వీయ రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వల్లనే ఈ కుతంత్రాలు పారిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
