నల్లగొండ జిల్లాలో నక్సల్స్ విధ్వంసం
విశాఖపట్నం: ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో నక్సలైట్లు విధ్వంసానికి దిగారు. రాయఘడ్ జిల్లా జిమిడిపేటలో కాంగ్రెస్ నాయకుడు డోకి సత్యనారాయణకు చెందిన ఆస్తులను విధ్వంసం చేశారు. దాదాపు వంద మంది మావోయిస్టులు, వారి సానుభూతిపరులు గురువారం రాత్రి డోకి సత్యనారాయణ ఇంటిని పేల్చివేశారు. అనంతరం ఆయనకే చెందిన రైస్‌మిల్లును మందుపాతరతో పేల్చివేశారు. గతంలో నక్సలైట్లు ఆయన చింతపండు గోడౌన్‌ను పేల్చివేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన చింతపండు వ్యాపారాన్ని మానుకున్నారు.
సత్యనారాయణ ఇంటిలోని దాదాపు వంద కిలోల వెండిని, బంగారాన్ని, దాదాపు లక్ష రూపాయలను నగదును నక్సలైట్లు తీసికెళ్లారు. చిన్న పిల్లల మీది బంగారాన్ని కూడా వారు వదలలేదు. దేవాలయాన్ని కూడా పేల్చివేయడానికి నక్సలైట్లు ప్రయత్నించారని, అయితే తాము వేడుకోవడం ఆ ప్రయత్నం మానుకున్నారని పూజారులు చెప్పారు. ఇది సత్యనారాయణ కట్టించిందే కదా అని నక్సల్స్ అడిగారని, కాదని తాము చెప్పామని, ప్రజలు కట్టించుకున్నారని తాము చెప్పామని, దాంతో వారు వెళ్లిపోయారని పూజారులు వివరించారు.
ఇదిలావుంటే, నక్సలైట్లు ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇన్‌ఫార్మర్ అనే నెపంతో ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో నక్సలైట్లు ఇన్‌ఫార్మర్ పేరుతో ఒక వ్యక్తిని హత్య చేశారు. సత్తిరెడ్డి అనే వ్యక్తిని నక్సలైట్లు ఇన్‌ఫార్మర్ పేరుతో చంపేశారు. అంతేకాకుండా, నల్లగొండ జిల్లా చందంపేట మండల రెవెన్యూ అధికారి ( ఎమ్మార్వో) కార్యాలయాన్ని పేల్చివేయడానికి ప్రయత్నించారు. అయితే భవనం యజమాని వేడుకోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఎమ్మార్వో కార్యాలయంలోని ఫర్నీచర్‌ను, రికార్డులను ధ్వంసం చేశారు. ఐదుగురు మావోయిస్టులు ఘటనకు పాల్పడ్డారు. ఇదే జిల్లా మోత్కూరు మండలం ధర్మారం గ్రామంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సుధాకర్ అనే ప్రతిఘటన నక్సలైట్ హతమయ్యాడు. మరో వైపు గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications
