రాష్ట్ర వార్షిక ప్రణాళిక 15 వేల 650 కోట్లుగా ఖరారు
న్యూఢిల్లీ: రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూ. 15650.77 కోట్లుగా ఖరారైంది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గురువారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ ఆహ్లూవాలియాతో సమావేశమై 2005 - 2006 రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఖరారు చేయించుకున్నారు. నిరుటి కన్నా ఇది దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అధికం. నిరుటి వార్షిక ప్రణాళిక 12 వేల కోట్ల రూపాయలు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ ఇక నుంచి ప్రణాళికేతర వ్యయం కిందికి వస్తుంది. సాగునీటికి అదనంగా రూ. 320 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కేటాయించిన రూ. 275 కోట్లకు ఇది అదనం. ఒకేసారి రాష్ట్రానికి ఇచ్చే మొత్తాన్ని పెంచారు. రాష్ట్రానికి అదనంగా రూ. 134 కోట్లు కేటాయించారు. ఉచిత విద్యుత్ సరఫరా విధానంపై మాంటెక్‌సింగ్ ఆహ్లూవాలియా హర్షం వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రణాళిక ఖరారు అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. విద్యుత్‌ను పొదుపు చేసే యంత్రాల వాడకం గురించి, సరఫరాలో నష్టాలను తగ్గించడం గురించి మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా ఎంతో ఆనందించారని ఆయన చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ 20 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు తాము ప్రాధాన్యం ఇస్తున్న విషయం గురించి, పెద్ద యెత్తున చేపడుతున్న బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం గురించి తాము ఆహ్లూవాలియాకు వివరించామని ఆయన చెప్పారు. రాష్ట్రం చేపడుతున్న వివిధ పథకాల గురించి కూడా వివరించామని, ప్రణాళికా సంఘం రాష్ట్ర పథకాలను ప్రశంసించిందని ఆయన చెప్పారు. గ్రామీణ పెట్టుబడుల ప్రణాళిక 25 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. ఉత్తమ నిర్వహణ, పనితీరు వల్లనే అదనపున నిధులను ప్రణాళికా సంఘం కేటాయించిందని ఆయన చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి కె. రోశయ్య, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా ఆహ్లూవాలియాతో సమావేశమయ్యారు. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో సమావేశమయ్యారు. ఆర్థిక ప్రమాణాలను తగిన విధంగా తాము పాటిస్తున్నందున తమకు అదనంగా 100 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన చిదంబరాన్ని కోరారు.












Click it and Unblock the Notifications
