వెంకయ్యనాయుడికి బిజెపి ఉపాధ్యక్ష పదవి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ జైట్లీ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. బిజెపి జాతీయ సమితి సమావేశాలు బుధవారం ముగిసిన విషయం తెలిసిందే.
ఏ పదవీ లేకపోయినప్పటికీ పార్టీ కోసం పని చేస్తున్నా ఉపాధ్యక్ష పదవిని చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ వెంకయ్య నాయుడును కోరారని, అద్వానీ ఒత్తిడితో వెంకయ్యనాయుడు ఉపాధ్యక్ష పదవిని చేపట్టడానికి అంగీకరించారని జైట్లీ చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల పదవుల్లో ఒకటి ఖాళీగా ఉన్న విషయంపై ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఆ పదవిలో ఉమాభారతిని నియమిస్తారా అని అడిగితే ఆయన జవాబు దాటవేశారు.
వెంకయ్యనాయుడు బిజెపి జాతీయాధ్యక్షుడిగా రెండేళ్ల పాటు పని చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో తన భార్య అనారోగ్యాన్ని కారణంగా చెబుతూ పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్యనాయుడు రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications
