నన్ను దళిత వ్యతిరేకిగా చిత్రించే కుట్ర: వివి
హైదరాబాద్: తనను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మావోయిస్టుల మాజీ ప్రతినిధి, విప్లవ కవి వరవరరావు అన్నారు. ఆదివాసీ దళిత సంఘాల పేరు మీద వరంగల్ జిల్లాల్లో విడుదలవుతున్న కరపత్రాలు పోలీసుల సృష్టేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. లేఖల ద్వారా తనను అప్రతిష్ట పాలు చేయాలని పోలీసులు కుట్ర పన్నారని, మావోయిస్టు మాజీ ప్రతినిధులు కళ్యాణ్‌రావు, గద్దర్, తాను కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కుట్రను భగ్నం చేసిన తర్వాత తనను అప్రతిష్ట పాలు చేయడానికి మరో ప్రయత్నం మొదలు పెట్టారని ఆయన అన్నారు.
తమ ఇంటి వద్ద నలుగురు పోలీసులు తచ్చాడుతున్నారని, అభద్రతాభావాన్ని, మానసిక ఆందోళనను కలిగించడానికే పోలీసులు ఆ విధంగా చేస్తున్నారని ఆయన అన్నారు. తనలో అభద్రతా భావాన్ని, మానసిక ఆందోళనను పెంపొందించే కార్యక్రమాన్ని లేఖలు విడుదల చేయడం దగ్గరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం ఉదయం ఐదున్నర గంటల నుంచి తమ ఇంటి వైపు ముగ్గురు పోలీసులు కన్నార్పకుండా చూస్తున్నారని, ఒక పోలీసు గంట, రెండు గంటలకోసారి వాహనాల మీద వచ్చేవారికి సమాచారం అందిస్తున్నాడని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
