కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం అలా చేయొద్దు..! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. అంతకు ముందే కొత్త పెన్షన్లు (New Pensions) ఇచ్చేందుకు వీలుగా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందుకోసం ఒకే కుటుంబంలో ఉంటున్న తల్లితండ్రులు, పిల్లలకు వేర్వేరుగా ప్రయోజనాలు అందించేలా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. రేషన్ కార్డుల విషయంలోనూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్న కారణంతో ప్రయోజనం కల్పించకుండా పక్కనబెట్టొద్దని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) కలెక్టర్ల సదస్సులో దీనిపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల జారీకి ముందే ఫ్యామిలీ యూనిట్ గా మ్యాపింగ్ చేయాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. ఉన్నవాటిని యథాతథంగా కొనసాగిస్తూనే మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలన్నారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మన లక్ష్యమన్నారు. పెద్ద కుటుంబానికే ఎక్కువ ప్రయోజనాల కల్పించేలా కార్యాచరణ ఉండాలన్నారు. రేషన్, పెన్షన్ల కోసం ఫ్యామిలీని విభజించటం సరికాదన్నారు. పెద్ద కుటుంబాలు మైక్రో ఫ్యామిలీలుగా మారిపోకూడదన్నారు..

కుటుంబంలో ఎంత మంది ఉంటే.. అంత మందికి తలో 5 కేజీల చొప్పున రేషన్ బియ్యం ఇచ్చేలా చూడాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. సంక్షేమంలోనే రూ.1.50 లక్షల కోట్ల మేర వ్యయం చేశామని, ఒక్క పెన్షన్లకే రూ.75 వేల కోట్ల ఖర్చు అయ్యిందని గుర్తుచేశారు. ప్రతీ నెలా క్యాలెండర్ ప్రకారం 1వ తేదీన పేదల సేవలో ద్వారా సంక్షేమాన్ని అందించే రోజు అన్నారు. మొత్తంగా నెలలో నాలుగు రోజుల పాటు వివిధ కార్యక్రమాల నిమిత్తం ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమాలకు హాజరు కావడంతోపాటు, మంచి ఆలోచనలు, విలువలతో కూడిన సమాజాన్ని తీర్చిదిద్దే అంశంపై ప్రజలతో చర్చిస్తున్నామని సీఎం తెలిపారు.














Click it and Unblock the Notifications
