EB-5 visa: 'గ్రీన్ కార్డు' కల ఇక మరింత భారం.. భారీగా పెరిగిన ఫీజులు
అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ కుటుంబాలకు షాకింగ్ న్యూస్. అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈబీ-5 (EB-5) ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌కు సంబంధించి ఫీజులను భారీగా పెంచేసింది. ఇప్పటివరకు ఉన్న ఫీజులను ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా సవరించడంతో.. అమెరికాలో అడుగుపెట్టాలనే కలలు కనేవారికి ఇకపై భారీగా ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నవంబర్ 30 నుంచి అమల్లోకి..
యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ కొత్త ఫీజుల పెంపునకు సంబంధించిన తుది మార్గదర్శకాలను అధికారికంగా ఖరారు చేసింది. ఈ కొత్త రేట్లు రాబోయే నవంబర్ 30 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. పన్నుల ద్వారా కాకుండా, పూర్తిగా దరఖాస్తుదారులు చెల్లించే ఫీజుల ద్వారానే ఇమ్మిగ్రేషన్ శాఖ నడుస్తుందని.. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లు, మోసాలను అరికట్టడం, సిబ్బంది నిర్వహణ ఖర్చుల నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.

ఏ ఫీజు ఎంతంటే?
ఈబీ-5 వీసా దరఖాస్తుల ఫీజులను పరిశీలిస్తే సామాన్యులకు చుక్కలు కనిపించడం ఖాయం. నేరుగా పెట్టుబడులు పెట్టే దరఖాస్తుదారులు ఉపయోగించే 'ఫారం I-526' ధర ప్రస్తుతం ఉన్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 7,615 డాలర్లకు పెరిగింది.
అలాగే, రీజినల్ సెంటర్లుగా దరఖాస్తు చేసుకునేవారి 'ఫారం I-526E' ధర కూడా 3,675 డాలర్ల నుంచి 7,850 డాలర్లకు ఎగబాకింది. వీటితో పాటు అదనంగా టెక్నాలజీ ఫీజులు, ఇంటిగ్రిటీ ఫీజులను కూడా భరించాల్సి ఉంటుంది.
రీజినల్ సెంటర్లపై పిడుగు పాటు
కేవలం వ్యక్తిగత దరఖాస్తుదారులే కాకుండా, రీజినల్ సెంటర్ల నిర్వహణ, అనుమతుల కోసం వసూలు చేసే ఛార్జీలను కూడా అమెరికా సర్కార్ విపరీతంగా పెంచింది. రీజినల్ సెంటర్ హోదా కోసం దరఖాస్తు చేసే 'ఫారం I-956' ఫీజు 17,795 డాలర్ల నుంచి ఏకంగా 44,115 డాలర్లకు పెంచారు. అలాగే కమర్షియల్ ఎంటర్‌ప్రైజ్ పెట్టుబడుల ఆమోదం కోసం వాడే 'ఫారం I-956F' ధర కూడా 17,795 డాలర్ల నుంచి 42,675 డాలర్లకు భారీగా పెరిగింది.
భారతీయులపై తీవ్ర ప్రభావం..
అమెరికాలో వ్యాపారాలు ప్రారంభించి, పది మంది స్థానికులకు ఉపాధి కల్పించడం ద్వారా గ్రీన్ కార్డు పొందవచ్చనే ఉద్దేశంతో గత దశాబ్ద కాలంగా భారత్ నుంచి ఈబీ-5 ప్రోగ్రామ్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే, ఇప్పటికే విపరీతమైన వెయిటింగ్లిస్ట్, దరఖాస్తుల బ్యాక్‌లాగ్ సమస్యలతో సతమతమవుతున్న భారతీయ కుటుంబాలకు ఇప్పుడు ఈ ఫీజుల పెంపు మరింత ఆర్థిక భారంగా మారనుంది. అర్హత సాధించాలంటే కనీసం 8 లక్షల నుంచి 1.05 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, ఇప్పుడు ఈ అదనపు ఫీజుల బాదుడు ఇన్వెస్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.














Click it and Unblock the Notifications
