ప్రాంతీయ బోర్డుల మాట మోసానికే: టిఆర్‌యస్
హైదరాబాద్: ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజలను మోసం చేయడానికేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నాయకులు కె. యాదగిరి రెడ్డి, మధుసూదనాచారి తదితరులు అన్నారు. ప్యాకేజీలు, బోర్డులు అంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించడం సరి కాదని వారు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్నికల పొత్త సమయంలో ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పుతోందని వారన్నారు. పొత్తు గౌరవించి తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రావాలని వారు కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అంశం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా వద్ద ఉన్నందున ఎవరూ మాట్లాడకూడదని చెప్పిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రకటనలు చేయడం ఎంత వరకు సమంజసమని వారన్నారు. తమపై సినీనటి విజయశాంతి చేసిన విమర్శలకు జవాబు చెప్పడానికి వారు నిరాకరించారు. విజయశాంతికి వాస్తవాలు తెలియవని, ఆమెకు అవగాహన కూడా లేదని వారన్నారు. ఇప్పుడిప్పుడే విజయశాంతికి అవగాహన వస్తోందని, ఉద్యమంలోకి ఆమె కొత్తగా వచ్చారని, నెమ్మదిగా వాస్తవాలు తెలుస్తాయని వారన్నారు. తెలంగాణ సాధన కోసమే తాము అధికారంలో పాలు పంచుకుంటున్నామని, పదవులు పదవుల కోసం కాదని వారన్నారు.












Click it and Unblock the Notifications
