గోవాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ కూటమి
పానాజి: గోవాలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య శాసనసభా పక్షం (యుయల్‌పి) గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం ఏర్పడింది. గోవాలో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్, ఒక స్థానాన్ని దాని మిత్ర పక్షమైన యన్‌సిపి దక్కించుకోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ యుయల్‌పికి దక్కింది. గోవాలో ఐదు శాసనసభా స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దక్కించుకుంది.
కాంగ్రెస్, బిజెపి కూటములకు దేనికీ సరైన మెజారిటీ లేకపోవడంతో గోవాలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలు ఈ రాజకీయ సంక్షోభానికి తెర దించాయి. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్‌కు 17 మంది, దాని భాగస్వామ్య పక్షాలైన యన్‌సిపికి ఇద్దరు, యంజిపికి ఒకరు శాసనసభ్యులు ఉన్నారు.
గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షం రేపు సమావేశమై తన నేతను ఎన్నుకుంటుంది. ముఖ్యమంత్రి పదవికి ప్రతాపసింగ్ రాణే, రవి నాయక్, లూసిన్హో ఫెలిరో పోటీ పడుతున్నారు. తమ శాసనసభా పక్ష నేత ఎన్నిక తర్వాత మిత్రపక్షాలను సంప్రదించి ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలుస్తామని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు రవి నాయక్ చెప్పారు.












Click it and Unblock the Notifications