పెనుకొండలో పరిటాల సునీత విజయం
అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీత విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి బోయ శ్రీరాములుపై 18,852 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. పరిటాల సునీతకు 65,730 ఓట్లు పోల్ కాగా బోయ శ్రీరాములుకు 46,870 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌లో తప్ప మిగతా 13 రౌండ్లలో సునీతకు మెజారిటీ ఓట్లు వచ్చాయి.
పెనుకొండ పోలింగ్ ఈ నెల 2వ తేదీన జరిగింది. తెలుగుదేశం శాసనసభ్యుడు, పరిటాల సునీత భర్త పరిటాల రవి హత్యకు గురికావడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. తన గెలుపు పరిటాల రవి హంతకులకు చెంప పెట్టులాంటిదని పరిటాల సునీత అన్నారు. తన భర్త చేసిన మంచి పనులకు ప్రజలు తనను గెలిపించారని ఆమె అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పెనుకొండలో గెలవడానికి డబ్బులు పంచారని, అక్రమాలకు పాల్పడ్డారని, అయితే అవేవీ పని చేయలేదని ఆమె అన్నారు.
సానుభూతి వల్లనే పరిటాల సునీత విజయం సాధించారని ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి బోయ శ్రీరాములు అన్నారు. పెనుకొండలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని, తాము ఆశించింది అదేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications