వోక్స్ వ్యాగన్ చెక్కును నిరాకరించిన వైయస్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి 11 కోట్ల 57 లక్షల 40 వేల రూపాయల చెక్కును అందజేయడానికి జర్మనీ కంపెనీ వోక్స్ వ్యాగన్ ప్రతినిధి ఫ్రాంక్ ఎల్బే ముందుకు వచ్చారు. అయితే ఆ చెక్కును స్వీకరించడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. ఎల్బే మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. వోక్స్ వ్యాగన్ తరఫున ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వశిష్ట వాహన్ అనే కంపెనీకి అందజేసిన విషయం తెలిసిందే. తమ ప్రతినిధి తప్పు చేసినందున ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని తాము నిర్ణయం తీసుకున్నామని ఎల్బే చెప్పారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో ఆ డబ్బు చెల్లింపుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ జరుగుతున్నందున చెక్కును తీసుకోవడం లేదని, పారదర్శకత పాటించాలనే ఉద్దేశంతోనే ఆ చెక్కును తీసుకోలేదని ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. డబ్బుల చెల్లింపు విసయంలో తప్పు ఎక్కడ జరిగిందనేది తేలాల్సి ఉందని, ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు అధికారులు, మంత్రులు తప్పు చేశారా, మరెవరైనా తప్పు చేశారా అనేది తేలాల్సి వుందని ఆయన అన్నారు. మన డబ్బులకు ఏ విధమైన ప్రమాదం లేదని నెలన్నర క్రితమే తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లనుందని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ ఫ్యాక్టరీ స్థాపనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications