వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా వద్ద ఉంది, తెలంగాణపై మాట్లాడను: సియం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని, ఈ అంశం తమ నాయకురాలు సోనియా గాంధీ వద్ద పరిశీలనలో ఉందని, సోనియానే అంతిమ నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఎపియుడబ్ల్యుజె) గురువారం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఆయన మొదట వివరించారు. అనంతరం జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాయలసీమలోని పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌కు 40 వేల క్యూసెక్కుల కృష్ణానది నీటిని మళ్లించాలనేది తాను తీసుకున్న నిర్ణయం కాదని, 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు తీసుకున్నారని, అది అమలు కాలేదని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నానని ఆయన వివరించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో డబ్బులు దండుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శల కోసం విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డబ్బులు దండుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చినవారందరూ అలాగే దండుకుంటారని అనుకుంటున్నారని, అందువల్ల సందర్భం కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ ఆ ఆరోపణ చేస్తున్నారని, చంద్రబాబు చేసే వమిర్శలను పట్టించుకునే పరిస్థితిలో తాము లేమని ఆయన అన్నారు. మున్సిపాలిటీలకు పరోక్ష ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యబద్దమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న డివిజన్ల కౌన్సిలర్లు, వార్డుల కౌన్సిలర్లు మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌లను, నగరపాలక సంస్థల మేయర్లను ఎన్నుకుంటారని, జడ్‌పటిసిలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ఎన్నుకోవడం ప్రజాస్వామ్యబద్దమైనప్పుడు ఇది ఎందుకు కాదని ఆయన అన్నారు.

మున్సిపాలిటీలకు డబ్బులు చాలా తక్కువ ఉన్నాయని, మెజారిటీ కౌన్సిలర్లు ఒక పార్టీకి, చైర్‌పర్సన్‌ మరో పార్టీకి చెందినవారయితే కార్యక్రమాలు చేపట్టడంలో ఆటంకం ఏర్పడుతుందని, దాని వల్ల అభివృద్ధి జరగదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మెజారిటీ కౌన్సిలర్లు ఉన్న పార్టీ నాయకుడే చైర్‌పర్సన్‌ అయితే కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకునే పరోక్ష ఎన్నికలకు మొగ్గు చూపామని ఆయన వివరించారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడం తమ ఇంటా వంటా లేదని, అది కాంగ్రెస్‌ నీతి కాదని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో వారికి తెలుసునని ఆయన అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అందగానే స్థానిక సంస్థలకు అధికారాలను బదాలయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఇప్పుడు కూడా నక్సల్స్‌తో చర్చలు జరపాలనే అనుకుంటున్నామని, చర్చల ద్వారా శాశ్వత శాంతి నెలకొనాలనేది తమ ఉద్దేశమని, అందుకు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద సంస్థల వద్ద ఆయుధాలు ఉండకూడదని తాము అంటున్నామని, ఆయుధాలు వీడి వస్తే నక్సల్స్‌తో చర్చలకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. తమ పార్టీలో టికెట్ల పంపకం స్థానిక స్థాయిలో జరిగిందని, స్థానికంగా రౌడీలు పోటీలో ఉండి గెలిస్తే వారు రాజకీయంగా ఎదకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X