కేసులకు నిరసనగా టిడిపి ధర్నాలు: అరెస్టులు
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో శాసనసభకు తప్పుడు పత్రాలు సమర్పించారనే ఆరోపణపై తమ పార్టీ శాసనసభ్యులపై కేసు నమోదు చేసినందుకు నిరసనగా సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి ట్యాంక్‌బండ్‌కు మొదలైంది. ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టి. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.
తమ నాయకులను తీసికెళ్తున్న పోలీసు వాహనాలకు పార్టీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వారిని తొలగించి టిడిపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాంపల్లి పోలీసు స్టేషన్ ఎదుట టిడిపి కార్యకర్తలు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నియంతృత్వపోకడలకు భయపడేది లేదని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం కార్యకర్తలు ధర్నాలు చేశారు.












Click it and Unblock the Notifications