ఇంటర్ సెకండియర్‌లోనూ బాలికలదే పైచేయి
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి అయింది. బాలుర కన్నా బాలికలు ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. బాలికలు 59.78 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 55.47 శాతం మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.
రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఉతీర్ణతలో అగ్రస్థానం పొందగా, నల్లగొండ జిల్లా చిట్టచివరి స్థానాన్ని ఆక్రమించింది. కృష్ణా జిల్లాలో 74.80 శాతం మంది విద్యార్థినీవిద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. నల్లగొండ జిల్లాలో 42.02 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 7,50,868 మంది విద్యార్థినీవిద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 1,24,522 మంది ఎ గ్రేడ్ సాధించారు. 1,14,433 మంది బి గ్రేడ్, 60,842 మంది సి గ్రేడ్, 20,125 మంది డి గ్రేడ్ పొందారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. నిరుడు ప్రభుత్వ కళాశాలల్లో 32.17 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 42 శాతం మంది పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థినీవిద్యార్థుల కోసం మే 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications