ప్రముఖ సంగీత దర్శకుడు నౌషాద్ కన్నుమూత
ముంబాయి: ప్రముఖ హిందీ చలనచిత్ర సంగీతదర్శకుడు నౌషాద్ అలీ శుక్రవారంనాడు కన్నుమూశారు. వయసు మీద పడడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అయిన నౌషాద్ అలీ గత కొంత కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. నౌషాద్ 67 హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన చివరగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రం 2005లో అక్బర్ ఖాన్ నిర్మించిన తాజ్ మహల్.
నౌషాద్ 1919 డిసెంబర్ 25వ తేదీన లక్నోలో జన్మించారు. 1930లో ముంబయి చేరుకున్న ఆయన రెండు దశాబ్దాల పాటు హిందీ చలనచిత్ర రంగాన్ని తన సంగీత మాధుర్యంతో ఓలలాడించారు. బైజూ బావ్రా, మదర్ ఇండియా, మొఘలే - ఎ - ఆజమ్ వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ప్రముఖ నేపథ్య గాయకులు మహ్మద్ రఫీని, లతా మంగేష్కర్‌ను ఆయనే హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశారు. నౌషాద్ గత నెల 20వ తేదీన నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్ను మూశారు.












Click it and Unblock the Notifications