మళ్ళీ తెలుగుదేశంలో చేరిన నారా రామ్మూర్తి నాయుడు
హైదరాబాద్: తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు తిరిగి తెలుగుదేశంలో చేరారు. ఆయన శనివారం ఉదయం మళ్ళీ టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ ఆశించిన రామ్మూర్తి నాయుడుకు టికెట్ రాకపోవడంతో ఆయన మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి దారుణంగా ఓడిపోయారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపికి నాయకత్వ లోపం ఉండడంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆలోచిస్తున్న నేపధ్యంలో తమ్ముడు రామ్మూర్తి నాయుడు చంద్ర గిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ విషయం పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు తమ్ముడిని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications