వైయస్ బహిరంగ లేఖ కపటం: రాఘవులు
హైదరాబాద్: ఉద్యోగులను తొలగించబోమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాసిన బహిరంగ లేఖపై సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉద్యోగులను తొలగించబోమంటూ రాజశేఖర రెడ్డి మంగళవారం సాయంత్రం ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి లేఖ మోసపూరితమైంది, కటపమైందని రాఘవులు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజమెత్తారు. ఉద్యోగులను తొలగించడానికి జారీ చేసిన ఐదో నెంబర్ జీవోను ఉపసంహరించుకోకుండా బహిరంగ లేఖ రాస్తే ఎలా నమ్మమంటారని ఆయన అడిగారు. జీవోను ఉపసంహరించకుండా ఆ విధంగా లేఖ రాయడం మరోసారి మోసం చేయడానికేనని ఆయన అన్నారు.
జీవోను రద్దు చేసి నమ్మమంటే ఏమైనా నమ్మడానికి అవకాశం వుంటుందని ఆయన అన్నారు. గత రెండేళ్ల అనుభవం కూడా ముఖ్యమంత్రిని నమ్మడానికి అవకాశాలు కల్పించడం లేదని ఆయన అన్నారు. హౌసింగ్ బోర్డు కార్పోరేషన్‌కు చెందిన 700 మంది ఉద్యోగులను తొలగించారని, తమను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేసినా ఫలితం లేకపోయిందని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. లాభాల్లో నడుస్తున్న ఆర్టీసి, సింగరేణిలను జీవోలో చేర్చి ఉద్యోగులను తీసేయబోమంటే నమ్మడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ లేఖకు ప్రతిగా రాఘవులు ఆర్టీసి కార్మికులు ఒక బహిరంగ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications