వచ్చే నెలలో పోలవరంపై ముఖ్యమంత్రుల భేటీ
న్యూఢిల్లీ: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుపై ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని సెప్టెంబర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర జలవనరుల మంత్రి సైఫుద్దీన్ సోజ్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఒరిస్సా పార్లమెంటు సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానమిస్తూ మంత్రి బుధవారం లోక్‌సభలో ఆ విషయం చెప్పారు. నిజానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఆగస్టులోనే నిర్వహించాలని తలపెట్టామని, అయితే వేరే కార్యక్రమాల వల్ల సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తు నుంచి 180 అడుగుల ఎత్తుకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి కోసం ప్రతిపాదనలు పంపిందని ఒరిస్సా పార్లమెంటు సభ్యులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి వీలు లేదని, ఒక వేళ ఎత్తు పెంచాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర జల సంఘాల అనుమతి అవసరమని మంత్రి చెప్పారు. ఒరిస్సాకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు కచ్చితమైన పునరావాసం కోసం చర్యలు తీసుకున్న తర్వాతనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని సైఫుద్దీన్ సోజ్ చెప్పారు. ఒరిస్సాకు నష్టం లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగేలా చూస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications