తప్పుల మీద తప్పులు, ఆపై బుకాయింపులు: బాబు
కరీంనగర్: తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేస్తూ బుకాయించే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఒక తెలుగు దినపత్రిక విషయంలో ప్రభుత్వం వాణిజ్య ప్రకటనను ఇవ్వడం దారుణమని ఆయన అన్నారు. వార్తకు ఖండన ఇవ్వవచ్చు గానీ వాణిజ్య ప్రకటన ఇవ్వడం కొత్త సంప్రదాయమని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితిలో కన్నా దారుణంగా ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లి మండలం ముల్కనూర్‌లో ఆయన గన్యా నివారణకు చికిత్స అందించే శిబిరాన్ని ఆయన గురువారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జీవో నెంబరు ఐదును రద్దు చేయడమే కాకుండా వివరణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగులను తొలగించడానికి ప్రభుత్వం జారీ చేసిన ఐదో నెంబరు జీవోను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు విధానాన్ని రూపొందించుకుని ఆ తర్వాత జీవోలు జారీ చేస్తుందని, అయితే వైయస్ ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా జీవోలను జారీ చేస్తోందని ఆయన అన్నారు. ఉద్యోగాల తొలగింపునకు జీవో జారీ చేసి అమలు చేయబోమంటే ఎలా నమ్మకం కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. సేవా రంగానికి సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. సింగరేణిని తమ ప్రభుత్వ హయాంలో లాభాల్లోకి తెచ్చామని, దీనిలోని ఉద్యోగులను కూడా సంస్కరణ అమలులో భాగంగా తీసేస్తామని ప్రభుత్వం అంటోందని ఆయన అన్నారు. ఐదో నెంబరు జీవోపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే ప్రతిపక్షాలను ఎగతాళి చేయడం, ఎదురుదాడికి దిగడం అధికార పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో భూముల వేలం పాటల తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. అవుటర్ రింగ్ రోడ్డు అన్ని మెలికలు ఎందుకు తిరిగిందని ఆయన అడిగారు. చికున్ గన్యా నివారణ పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications