నిలిపివేత సరిపోదు, రద్దు చేయాల్సిందే: రాఘవులు
హైదరాబాద్: ఉద్యోగులను తొలగించే ఐదో నెంబరు జీవోను పూర్తిగా రద్దు చేయాలని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో అమలును నిలిపివేయడం మాత్రమే సరిపోదని, దాన్ని పూర్తిగా రద్దు చేయడం అవసరమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రతిపక్షాల నుంచి, కార్మిక సంఘాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు, విమర్శలు రావడంతో ప్రభుత్వం జీవో అమలును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్‌ను కూడా రద్దు చేయాలని రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జీవోను నిలిపివేస్తామని ప్రకటించినంత మాత్రాన ప్రభుత్వం విశ్వసనీయతను పొందలేదని ఆయన అన్నారు. ఉద్యోగులను తొలగించి ఏజెన్సీల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకుని పనులు సాగించాలనేది ప్రభుత్వ ఎత్తుగడ అని ఆయన అన్నారు. ఫుడ్ క్యాటరింగ్‌లా ఎంప్లాయ్స్ క్యాటరింగ్ కోసం ఏజెన్సీలు ఏర్పడతాయని, ఈ ఏజెన్సీలు కూడా మంత్రులు, వారి బంధువులు ఏర్పాటు చేస్తారని, తద్వారా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడతారని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులను అంగీకరించినట్లయితే ఉచిత విద్యుత్‌ను ఎలా అందిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో సాంకేతికంగా ఉచిత విద్యుత్ సరఫరా లేదని, ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications