గత ప్రభుత్వం వల్లనే నీరు వృధా: పొన్నాల
నాగార్జునసాగర్: వరద నీటిని సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలు గత ప్రభుత్వం చేపట్టి వుంటే రాష్ట్ర సస్యశ్యామలమై వుండేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయడం బాధాకరమే అయినా నిల్వ చేసే సదుపాయాలు లేకపోవడంతో తప్పడం లేదని ఆయన గురువారం నాగార్జునసాగర్‌లో అన్నారు. నాగార్జునసాగర్‌కు ఇతోధిక నీరు వచ్చి చేరుతుండడంతో 18 గేట్లు ఎత్తివేశారు.
తాము గత రెండేళ్లలో వరద నీరు సముద్రంలోకి వృధాగా పోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలు, రాయలసీమలోని హంద్రీనీవా, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలు చేపట్టి వుంటే మహబూబ్‌నగర్, నల్లగొండ, గుంటూరు తదితర జిల్లాలు సస్యశ్యామలమై వుండేవని ఆయన అన్నారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్ద యెత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో తుంగభద్ర, కృష్ణానదుల్లో వరద ఉధృతి పెరిగింది.












Click it and Unblock the Notifications